Crime News: బిహార్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. హైవే పక్కన ఉన్న పొదల్లో యువతి అర్థ నగ్న శవం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్, భోజ్‌పూర్ జిల్లాలోని బారుషి-విష్ణుపుర గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఉదయం పూట దగ్గరలో ఉన్న హైవేపై నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో హైవే పక్కన ఉన్న పొదల్లో ఎవరో మనిషి పడుకుని ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. ఎవరా అని పొదల దగ్గరకు వెళ్లారు. అక్కడికి పోయిన తర్వాత అసలు విషయం తెలిసింది. అదో యువతి శవం అని తెలియగానే షాక్‌కు గురయ్యారు. పైగా యువతి శవం అర్థ నగ్నంగా ఉండటంతో మరింత భయానికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
యువతిపై అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత హత్య చేసినట్లు భావిస్తున్నారు. యువతి కాలుకు ఓ గుడ్డ ముక్క కట్టి ఉంది. నీలం రంగు సెల్వార్ షూట్ ధరించి ఉంది. సంఘటనా స్థలంలో దొరికిన తుపాకికి సంబంధించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను తుపాకితో పాయింట్ బ్లాక్‌లో కాల్చి చంపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. యువతి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్తులను విచారిస్తున్నారు. హైవే, గ్రామం చుట్టుపక్కల ఉన్న సీసీకెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇక, ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది.