అర్థరాత్రి ప్రియురాలిని కలవటానికి వెళ్లిన ప్రియుడిని చావు పలకరించింది. ఇద్దరూ ఏకాంతంగా ఉండగా యువతి కుటుంబసభ్యులు చూశారు. అతడ్ని పట్టుకుని చెట్టుకు కట్టేసి చావకొట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు కన్నుమూశాడు. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్, ముజఫర్‌నగర్‌లోని హసాన్‌పూర్ తొలి గ్రామానికి చెందిన 19 ఏళ్ల అయాన్ మెహందీ.. ఛత్ ఘాట్‌కు చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. దాదాపు 5 ఏళ్ల నుంచి వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వీరి ప్రేమ గురించి తెలిసి యువతి కుటుంబసభ్యులు ఆమెను హెచ్చరించారు. అయాన్‌కు దూరంగా ఉండాలని అన్నారు. దీంతో దూరం అవ్వాల్సి వస్తుందని భావించి ఇద్దరూ రెండేళ్ల క్రితం ఇంటినుంచి పరారయ్యారు.
యువతి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ కేసు నమోదైంది. పోలీసులు ఇద్దర్నీ వెతికి పట్టుకున్నారు. ఆ సమయానికి యువతి మైనర్ కావటంతో అయాన్‌పై కిడ్నాప్ కేసు నమోదైంది. ఇప్పటికి కూడా ఆ కేసు నడుస్తూనే ఉంది. ఇద్దరూ ఫోన్‌లలో తరచుగా మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, అయాన్‌ను అతడి ప్రియురాలు ఇంటికి పిలిచింది. తప్పని సరిగా ఇంటికి రావాలని ఒత్తిడి చేసింది. ప్రియురాలి మాట కాదనలేక అర్థరాత్రి పూట ఛత్ ఘాట్‌కు వెళ్లాడు. ప్రియురాలి ఇంటి దగ్గర ఇద్దరూ ఏకాంతంగా కలుసుకున్నారు. అదే సమయంలో కుటుంసభ్యులు వీరిని చూశారు. అయాన్‌పై ఆగ్రహంతో రగిలిపోయారు. ఇతర గ్రామస్తుల సహకారంతో అతడ్ని చెట్టుకు కట్టేశారు.
విచక్షణా రహితంగా దాడి చేశారు. అయాన్ మిత్రులు ఆపటానికి ప్రయత్నించారు. దీంతో వారిపై కూడా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అయాన్ అక్కడికక్కడే కుప్పకూలాడు. అతడితో పాటు అతడి స్నేహితులను కూడా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అయాన్ కన్నుమూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు యువతి కుటుంబసభ్యుల్ని విచారించగా.. అయాన్ తమ బిడ్డపై లైంగిక దాడికి పాల్పడుతుండటంతో దాడి చేశామని వారు చెప్పటం గమనార్హం.