కొన్ని ప్రేమ కథలు తీరానికి చేరి పెళ్లి వరకు వెళ్తుంటాయి. మరికొన్ని కథలు ఊహించని విషాదంతో ముగింపును పలుకుతున్నాయి. ఇలా ఎన్నో ప్రేమ కథలు తీవ్ర విషాదాన్ని నింపి కంచికి చేరని కథల్లాగా చరిత్రలో మిగిలిపోతున్నాయి. సరిగ్గా ఇలాంటి ఓ ప్రేమకథలో సైతం ఊహించని మలుపులతో చివరికి విషాదమే మిగిలింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని కాల్వ బజారు. ఇదే ప్రాంతానికి చెందిన కుంజా సాయి(20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తల్లి గతంలో మరణించగా, తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు.
అయితే అప్పటి నుంచి తండ్రి వద్దే ఉంటున్న యువకుడు మణుగూరు మండలానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతి తండ్రి సైతం గతంలో మరణించగా తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. గత కొంత కాలం నుంచి వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. దీంతో ఎలాగైన పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇటీవల సాయి తన ప్రియురాలిని ఇంటికి తీసుకొచ్చి తండ్రి ముందు ఉంచాడు. కోపంతో ఊగిపోయిన తండ్రి ఇద్దరిని మందలించడంతో యువతి తీవ్ర మనస్థాపానికి లోనై అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత దీనిని భరించలేని ఆ యువతి కొన్ని రోజుల కిందట ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది.
ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడడంతో సాయి ఆమెను తలుచుకుంటూ రోజూ ఏడుస్తూ ఉన్నాడు. తాను ప్రేమించిన అమ్మాయి లేని ఈ లోకంలో నేను బతికుంలేను అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. సాయి కూడా ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక కుమారుడు మరణవార్త తెలుసుకున్న సాయి తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు. మొన్న ప్రియురాలు, నేడు ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. తీరం చేరని ఈ విషాద ప్రేమకథా చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.