నేటి కాలంలో చాలా మంది ప్రతీ చిన్న విషయానికి క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. భర్త కొత్త చీర కొనివ్వలేదని, తల్లిదండ్రులు మందలించారని, ప్రియుడు మోసం చేశాడనే కారణాలతో చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ యువకుడు తల్లి రీఛార్జ్ కు డబ్బులు ఇవ్వలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? రీఛార్జ్ డబ్బులు ఇవ్వని కారణంగానే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేదైనా కారణం దాగి ఉందా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామం. ఇక్కడే యడ్లపల్లి సురేందర్ (24) అనే యువకుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే కొంత వరకు చదువుకున్న సురేందర్ కొంత కాలం తర్వాత చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక అప్పటి నుంచి తల్లిదండ్రులకు పనిలో సాయం చేస్తూ ఉండేవాడు. అయితే సురేందర్ గత కొంత కాలం నుంచి తమ పశువులను మేపుతూ ఉండేవాడు. ఇదిలా ఉంటే ఇటీవల తన మొబైల్ ఫోన్ రీఛార్జ్ గడువు ముగిసింది. దీంతో వెంటనే సురేందర్.. మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు ఇవ్వాలని తన తల్లిని కోరాడు. దీనిపై స్పందించిన తల్లి.. ఇప్పుడు లేవు, కూలీ డబ్బులు రాగానే ఇస్తానని చెప్పింది.
ఇదే విషయంపై తల్లీకొడుకు మధ్య కాస్త వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కుమారుడు సురేందర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. సురేందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే సురేందర్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో సురేందర్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రీఛార్జ్ కు డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న సురేందర్ నిర్ణయంపై మీరు ఎలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.