భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం కొనసాగుతున్నది. గంట గంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరీవాహక ప్రాంతంలో గోదావరి వరద ఉద్ధృతికి 95 గ్రామాలు నీటమునిగాయి. పుంపు బాధితులను మంత్రి పువ్వాడ, కలెక్టర్ అనుదీప్ కలిసి వారి పరిస్థితుల అడిగి తెలుసుకున్నారు.
దొంగలకు ఎదుటి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా.. తమకు పట్టనట్టే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఓ వైపు వరద బాధలతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. కొంత మంది దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. వరదలకు ఇప్పుడు సుభాష్ నగర్ కాలనీ వాసులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. తమ కాలనీల్లోకి కొంత మంది దొంగలు రాత్రిపూట పడవలు వేసుకొని వెళ్లి ఇంట్లో విలువైన వస్తువులు దోచుకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని టార్గెట్ చేసుకొని కొంత మంది దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. అయినా ఏం చేయలని దీన స్థితిలో ఉన్నామని బాధితులు లబో దిబో అంటున్నారు. వరదలు వస్తున్నాయని హెచ్చరించడంతో.. హడావుడిగా తాళాలు కూడా వేయకుండా వచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది తాము తాళాలు వేసినా పగలగొట్టి ఇళ్లు దోచేస్తున్నారని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దొంగల బాధకు రాత్రి పూట నీళ్లలో నిలబడి మరీ కాపలా కాయాల్సి వస్తుందని అంటున్నారు బాధితులు. పోలీసులు వెంటనే ఈ విషయం పై దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు. సుభాష్ నగర్ నుంచి కట్టుబట్టలతో వచ్చామని.. తమ వద్ద ఏవీ లేవని అంటున్నారు. తమ ఇళ్లలో దొంగలు పడుతున్నా వెళ్లి చూస్తామంటే పోలీసులు పరిమిషన్ ఇవ్వడం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు. కేటుగాళ్లు తమ ఇళ్లలో ఫ్రిజ్జు, టీవీ, ఇతర విలువైన వస్తువులు దొంగిలిస్తున్నారని పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ విషయంపై పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తుంది.
మరోవైపు సుభాష్ నగర్ వరకు కరకట్ట పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. కరకట్ట పొడిగింపు పై హామీ ఇచ్చే వరకు ఆందోళన చేస్తామంటున్న స్థానికులు. గోదావరి వరదలతో 2 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే భద్రాచంలోని సుభాష్ నగర్ కాలనీ వాసులతో అధికారులు చర్చిస్తున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు. సుభాష్ నగర్ కాలనీ వాసులతో ఎమ్మెల్యే పోడెం వీరయ్య బైఠాయించారు.
ఇది చదవండి: Godavari River: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. వంతెనపై రాకపోకలు బంద్!