సినిమాలు సమాజం మీద ప్రభావం చూపుతాయి అనే మాట వాస్తవం. అందుకే చాలా మంది విశ్లేషకులు ప్రస్తుతం సినిమాగా తెరకెక్కుతున్న కథలు, మూవీల్లోని సన్నివేశాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. ప్రస్తుతం వస్తోన్న సినిమాల్లో హింస, అశ్లీలం స్థాయి పెరుగుతుందనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ డిబెట్ సంగతి కాసేపు పక్కన పెడితే.. తెలుగు సినిమా ఓ యువకుడి ప్రాణం తీసింది. సినిమా చూసిన వ్యక్తి.. దానిలో చూపించిన విధంగా మోక్షం పొందడం కోసం ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి సమీపంలో ఒక గ్రామానికి చెందిన రేణుకా ప్రసాద్ అనే యువకుడు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయి.. ప్రస్తుతం ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నాడు. ఇలా టైం వేస్ట్ చేసే బదులు ఏదో ఒక పని చూసుకోమని.. తల్లిదండ్రులు చెప్పినా వినేవాడు కాదు. ఖాళీగా ఇంటి దగ్గర ఉండటంతో విపరీతంగా సినిమాలు చూడటం మొదలు పెట్టాడు. దానిలో భాగంగా ఓ తెలుగు సినిమాను సుమారు 25 సార్లు చూశాడు. ఆ సినిమాలో చూసించిన విధంగా ఆత్మహత్య చేసుకుంటే మోక్షం వస్తుందని భావించాడు.
ఈ క్రమంలో గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లి.. 20 లీటర్ల పెట్రోలు ఒంటి మీద పోసుకుని తనకు తానే నిప్పంటించుకున్నాడు. దీనికి ముందే.. తాను ప్రాణ త్యాగం చేసుకుంటున్నాని.. అలా చేస్తే మోక్షం లభిస్తుందని.. అందుకే ఇలా చేశానని వీడియో తీసి తండ్రికి పంపాడు. బాధితుడ్ని గమనించిన స్థానికులు.. అతడిని రక్షించి.. బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బాధితుడు రేణుకా ప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.