ప్రేమించిన వాడే ఆ యువతి పాలిట యమకింకరుడు అయ్యాడు. క్షణికావేశంలో ప్రియుడు ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమె వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో చంపేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల సంతోష్ దామి, 23 ఏళ్ల కృష్ణకుమారి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సంతోష్ ఓ సెలూన్ షాపులో పని చేస్తుండగా.. కృష్ణ కుమారి స్పాలో పనిచేస్తోంది. వీరిద్దరూ టీసీ పాళ్యలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అందులోనే సహజీవనం చేస్తున్నారు. చాలా కాలం నుంచి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. అయితే, సంతోష్ స్నేహితుల విషయంలో ఇద్దరికీ గొడవలు జరిగేవి.
అతడు తరచూ స్నేహితులను ఇంటికి తీసుకువస్తూ ఉండేవాడు. కానీ, ఇది ఆమె నచ్చేది కాదు. అయినా అతడు పట్టించుకునే వాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం కూడా అతడు తన స్నేహితులను ఇంటికి తీసుకువచ్చాడు. ఆ సమయంలో ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ ఉంది. తన స్నేహితులను తీసుకువచ్చిన ప్రతీసారి ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. దీంతో ఆమెపై అతడికి అనుమానం వచ్చింది. ఆమెను ఈ విషయమై నిలదీశాడు. మాటకు మాట అనుకున్నారు. ఆమె తనను ఎదురించి మాట్లాడుతుండటంతో అతడి కోపం పెరిగిపోయింది. ఆ కోపం తారాస్థాయికి చేరి రాడ్డుతో ఆమె తలపై దాడి చేశాడు. దెబ్బ గట్టిగా తగలటంతో ఆమె తలకు బలమైన గాయం అయింది. ఆమె తన స్నేహితురాలికి వీడియో కాల్ చేసి గొడవ గురించి, సంతోష్ కొట్టడం గురించి చెప్పి విచారం వ్యక్తం చేసింది.
కృష్ణకుమారి తమ గొడవ గురించి ఆమె స్నేహితురాలికి చెప్పటంతో అతడి కోసం మరింత పెరిగింది. వెంటనే ఆమె గొంతునులిమి చంపేశాడు. ఇదంతా ఆమె స్నేహితురాలు వీడియో కాల్‌లో ఉండగానే జరిగింది. దీంతో ఆ స్నేహితురాలు హుటాహుటిన కృష్ణకుమారి ఇంటికి వచ్చింది. విగతజీవిగా పడిఉన్న కృష్ణకుమారిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కృష్ణకుమారికి గతంలోనే పెళ్లయి విడాకులు కూడా తీసుకుందని పోలీసులు తెలిపారు. ఓ కూతురు కూడా ఉందని అన్నారు. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో గొడవపెట్టుకుని చంపేశాడని వెల్లడించారు.