యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కాలేజ్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వానియా షేక్ అదే ప్రాంతంలోని సుభార్తి మెడికల్ కాలేజ్‌లో బీడీఎస్ చదువుతోంది. సిద్ధార్థ్ పన్‌వర్ అనే యువకుడు ఆమెతో పాటే బీడీఎస్ చదువుతున్నాడు.
సిద్ధార్ధ్ గత కొంతకాలం నుంచి ప్రేమ పేరుతో వానియాను వేధింపులకు గురిచేస్తున్నాడు. అతడి వేధింపులు తాళలేక ఆరు నెలల క్రితం ఆమె కాలేజ్ యజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో అతడ్ని కాలేజ్‌నుంచి కొన్ని నెలలు సస్పెండ్ చేశారు. అయినా అతడిలో మార్పురాలేదు. ఆమెకు రోజూ ఫోన్ చేసి హింసించసాగాడు. దీంతో వానియా మానసికంగా, శారీరకంగా అల్లాడిపోయింది. అక్టోబర్ 19న కాలేజ్ లైబ్రరీలో ఉండగా ఆమెకు ఓ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్‌లో ఆమె ఎవరితోనో గొడవపడింది. ఆ వెంటనే కాలేజ్ బిల్డింగ్ ఎక్కింది. అందరూ చూస్తుండగా బిల్డింగ్‌పై నుంచి కిందకు దూకింది.
ఆమె శరీరం బలంగా నేలకు తాకింది. దీంతో ఎముకలు విరిగి అక్కడే స్ప్రహ కోల్పోయింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వానియాను పరీక్షించిన వైద్యులు ఆమె వెన్నుముక విరిగినట్లు తేల్చారు. ఆపరేషన్ నిర్వహించారు. అయినప్పటికి వైద్యుల శ్రమ ఫలించలేదు. చికిత్స పొందుతూ వానియా శనివారం మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్ధార్ధ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వానియా బిల్డింగ్ మీదనుంచి కిందకు దూకిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.