నకిలీ పత్రాలతో బ్యాంకులను బురిడీ కొట్టించిన వీఎంసీ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ హిమ బిందును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మరో ఇద్దరు డైరెక్టర్ల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. వీఎంసీఎస్‌ఎల్‌పై సీబీఐ అధికారులు ఫోర్జరీ, మోసం తదితర సెక్షన్ల కింద 2018లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీని ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగింది. ఫోరెన్సిక్ ఆడిట్‌లో అక్రమంగా మరికొన్ని కంపెనీలకు నగదును మళ్లించినట్టు గుర్తించారు. అంతేగాక రూ.692 కోట్లకు నకిలీ లెటర్ ఆఫ్ క్రెడిట్స్‌ను, ఇతర పత్రాలను సృష్టించినట్టు తేలింది. దర్యాప్తు చేపట్టిన ఈడీ – ముగ్గురు డైరెక్టర్లకు విచారణకు సహకరించాలని నోటీసులిచ్చింది. అయితే డైరెక్టర్లు స్పందించకపోవడంతో హిమబిందును అరెస్ట్ చేశారు.
వీఎమ్‌సీ సిస్టమ్స్ కంపెనీ డైరెక్టర్లు నకిలీ పత్రాలు సృష్టించి పలు బ్యాంకుల నుంచి రుణాలు పొందిన సంగతి తెలిసిందే. నకిలీ పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.539 కోట్లు ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్ నుంచి రూ.1207 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీఎమ్‌సీ కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లపై కేసు నమోదైంది. సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ముగ్గురు డైరెక్టర్లు ఉప్పలపాటి హిమబిందు, రామారావు, రమణపై కేసు నమోదు చేసింది. బీఎస్‌ఎన్ఎల్ నుంచి రావాల్సిన బకాయిలు వస్తే డబ్బులు చెల్లిస్తామని సీబీఐ అధికారులని నమ్మించారు డైరెక్టర్లు. వాస్తవానికి రావాల్సింది 33 కోట్లు ఉంటే 262 కోట్లు రావాల్సి ఉందని రూ.262 కోట్లు రావాల్సి ఉందని తప్పుదోవ పట్టించారు.