ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే ఎంత కష్టతరంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యోగాలు వందల సంఖ్యలో ఉంటే.. లక్షల్లో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రేయింబవళ్లు.. కష్టపడి చదివి..ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తర్వాత కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే.. వారి కుటుంబ సభ్యులే కాక బయట వారు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చేసింది. ఎంతో కష్టపడి కలల కొలువు సాధించిన యువకుడు.. ఉద్యోగంలో చేరి రెండేళ్లు కూడా గడవకముందే ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆ వివరాలు..
బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న రమణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఇతను 2020 ఎస్సై బ్యాచ్‌కు చెందిన వాడు. ఉద్యోగంలో చేరి రెండేళ్లు కూడా గడవకముందే ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అందరిని కలిచి వేస్తోంది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తోన్న రమణ.. గురువారం మల్కాజిగిరి పరిధిలోని మౌలాలీ వెళ్లాడు. అనంతరం రైల్వే ట్రాక్ మీద తలపెట్టి.. ఆత్మహత్య చేసుకున్నాడు. రమణను గమనించిన స్థానికులు దీని గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక మృతుడిని ఎస్సై రమణగా గుర్తించారు. కాగా అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.