బంజారాహిల్స్ స్కూల్‌లో చిన్నారిపై అత్యాచారం ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే పోలీసులు నిందితుడు రజనీ కుమార్‌ను అరెస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం స్కూలు ప్రిన్సిపల్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, బాలిక తల్లిదండ్రులతో పాటు మరికొంత మంది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కూతురులాంటి పరిస్థితి ఏ బిడ్డకు రాకూడదని పాప తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కాగా, హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ పబ్లిక్ స్కూల్ ఉంది. రజినీ కుమార్ అనే వ్యక్తి ఆ స్కూల్ ప్రిన్సిపల్ మాధవికి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంనుంచి రజనీ కుమార్ స్కూల్లోని పిల్లలను వేధిస్తున్నాడు.
గత రెండు నెలలనుంచి అతడు ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. నిన్న కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం అనంతరం బాలిక అస్వస్థతకు గురైంది. ఇంటి దగ్గరకు వెళ్లిన తర్వాత బాలిక నీరసంగా ఉండటంతో తల్లిదండ్రులు ఏమైందని ప్రశ్నించారు. బాలిక గట్టిగా ఏడుస్తూ జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించింది. కూతురు చెప్పింది విని పాప తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. స్కూలు దగ్గరకు వెళ్లి నిందితుడిపై దాడి చేశారు. అనంతరం అతడ్ని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Hyderabad: బంజారాహిల్స్ స్కూల్ ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు!