కరోనా, లాక్‌డౌన్ ఈ రెండూ ఎందరో జీవితాలను మార్చేశాయి. లాక్‌డౌన్ కారణంగా పడిన వ్యధలు, చూసిన బాధలు ఇంకా జనాల మనసుల్లో మెదులుతూనే ఉన్నాయి. కరోనా రోజుల నుంచి కొందరు ఆకలి, కష్టం విలువ తెలుసుకుంటే.. మరికొందరు అడ్డదారులు, అక్రమ ఆర్జనలకు తెర లేపారు. ఆ కోవకు చెందిన ఈ యువకుడు చేసిన పనికి పోలీసులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన జావేద్ బెంగళూరులో ఎంబీఏ పూర్తి చేశాడు. కమ్మనహళ్లి నివసించే జావేద్.. నెమ్మదిగా గంజాయికి అలవాటు పడ్డాడు. గత మూడేళ్లుగా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. అతనితో ఆపకుండా తన మిత్రులకు కూడా గంజాయి, మత్తు పదార్థాలు అలవాటు చేశాడు. కమ్మనహళ్లి నుంచి బిదాదికి మకాం మార్చాడు. లాక్‌డౌన్ సమయంలో జావేద్‌కు ఎక్కడా మత్తు పదార్థాలు లభించలేదు. వాటి కోసం బాగా ఇబ్బంది పడ్డాడు. ఇంట్లో ఎందుకు పెంచకూడదు అని ఆలోచన చేశాడు.
డ్రగ్స్ దొరక్క ఇంబ్బంది పడిన జావేద్ తన తెలివితేటలు ఉపయోగించి గంజాయి పెంచాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా బ్లాక్ మార్కెట్‌లో గంజాయి విత్తనాలు ఆర్డర్ చేశాడు. తన ఇంట్లోని ఫిష్ ట్యాంక్‌లో శాంపిల్ విత్తనం నాటి చూశాడు. అది మొలకెత్తడంతో ఇంట్లో ఎల్‌ఈడీ లైట్లతో కృత్రిమ వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు. గంజాయి మొక్కలు పెంచి వాటిని మత్తు పదార్థాలుగా మార్చడం మొదలు పెట్టాడు. ఒక్క గ్రాము మత్తు పదార్థాన్ని దాదాపు 4 వేల వరకు అమ్మ సాగాడు.
లాక్‌డౌన్ సమయంలో డ్రగ్స్ విక్రయించి జావేద్ బాగానే ఆర్జించాడు. తన మిత్రులతో డ్రగ్స్ రవాణా చేసేవాడు. గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం సాగిస్తున్నాడు. మూడ్రోజుల క్రితం డీజే హళ్లిలో ఇద్దరు డ్రగ్స్ సరఫరాదారులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని పోలీసుల స్టైల్‌లో విచారించగా.. జావేద్ సమాచారం బయటకు వచ్చింది. వారు ఇచ్చిన అడ్రెస్‌కు వెళ్లి చూడగా పోలీసులు కంగుతిన్నారు. జావేద్ సెటప్ చూసి బిత్తరపోయారు. జావేద్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.