అతడు దుపట్టా వేసుకోకుండా రోడ్లపై తిరిగే ఆడవాళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వస్తున్నాడు. ఇలా చెన్నైలోని పలు ఏరియాల్లో ఏకంగా 75 మంది మహిళల్ని వేధించాడు.
శాస్త్ర సాంకేతికత పరంగా దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ఆడవాళ్లను అర్థం చేసుకునే విషయంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. ముఖ్యంగా వేసుకునే దుస్తుల విషయంలో వారికి తరచుగా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ కీచకుడు దుపట్టా వేసుకోని మహిళలపై వేధింపులకు తెగబడ్డాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 75 మంది మహిళల్ని అతడు వేధించాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
తమిళనాడులోని చెన్నైకి బగీర్ దుపట్టా వేసుకోని మహిళలపై కక్ష గట్టాడు. దుపట్టా లేకుండా కనిపించిన ఆడవాళ్లపై వేధింపులకు దిగటం మొదలుపెట్టాడు. అలా చెన్నైలోని అన్నానగర్, జేజే నగర్, తిరుమంగళం, పెరవల్లూర్ ప్రాంతాల్లో దుపట్టా లేకుండా కనిపించిన ఆడవాళ్లపై లైంగిక వేధింపులకు దిగాడు. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం తిరుమంగళం ఏరియాలో ఓ 17 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బగీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణలో అతడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఒంటరిగా కనిపించిన వాళ్లను మాత్రమే తాను వేధిస్తానని చెప్పాడు. దుపట్టా లేకుండా తిరిగే ఆడవాళ్లు నగ్నంగా ఉన్నట్లేనని అతడు చెప్పాడు. అందుకే వారిని వేధించినట్లు పేర్కొన్నాడు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.