నవ్యకు చదువంటే ప్రాణం. చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అనుకుంది. కానీ, విధి ఆమెతో ఊహించని ఆట ఆడుకుంది. విధి ఆడిన వింత నాటకంలో నవ్య పావుగా మారింది..
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకోవటం మామూలైపోయింది. సమస్యకు పరిష్కారం ఉందా లేదా అన్నది ఆలోచించకుండా ప్రాణాలు తీసుకోవటమే మార్గంగా భావిస్తున్నారు. ముఖ్యంగా యువత ఆత్మహత్యలు చేసుకోవటంలో ముందు వరుసలో ఉంటోంది. తాజాగా, ఓ యువతి కాలేజీ ఫీజు విషయంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీరామపురానికి చెందిన నవ్య ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. నవ్య చదువులో ఎంతో చురుగ్గా ఉండేది. చక్కగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని భావించేది. తన సంపాదనతో కుటుంబాన్ని చూసుకోవాలని అనుకునేది. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమెకు అడ్డంకులు ఎదురయ్యాయి. డబ్బులు సర్థుబాటు కాకపోవటంతో కుటుంబసభ్యులు కాలేజీ ఫీజు చెల్లించలేకపోయారు. దీంతో నవ్య మనస్తాపానికి గురైంది.
తాను ఎంతో ఇష్టపడుతున్న చదువు తనకు అందదని భావించింది. చదువు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. ఆత్మహత్యే తనకు శరణ్యం అనుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నవ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నవ్యది ఆత్మహత్యా? లేక హత్యా అన్న కోణంలో విచారిస్తున్నారు. మరి, కాలేజీ ఫీజు విషయంలో మనస్తాపానికి గురై నవ్య ఆత్మహత్య చేసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.