‘ప్రేమ’కు కులం, మతం, వర్గం భేదాలు ఉండవని అంటుంటారు. మనసులు కలిస్తే వయసు తేడాలను కూడా లెక్కచేయరు. ఇక్కడ వారి వరసలను కూడా పరిగణవలోకి తీసుకోలేదు. మధ్యప్రదేశ్‌లోని సిహావల్‌లో మేనత్తతో ప్రేమలో పడ్డాడు ఓ మేనల్లుడు. గాడంగా ప్రేమించుకున్న వారు శారీరకంగానూ ఒక్కటయ్యారు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఆమె 6 నెలల గర్భవతి అయ్యేసరికి మొత్తం కథంతా ఇంట్లో పెద్దోళ్లకి తెలిసిపోయింది.
వయసు పరంగా ఆమెకు 18, అతనికి 19 అయినా వారి ప్రేమకు వారి బంధాలు అడ్డొచ్చాయి. యువతి, యువకుడు పెద్దోళ్లను ప్రాథేయపడ్డారు. తమ వివాహానికి అంగీకరించాల్సిందిగా కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. వారి బంధాన్ని ఈ సమాజం ఒప్పుకోదని, తమకు చెడ్డపేరు వస్తుందని ఆ జంటను వారించారు. ఇద్దరినీ దూరంగా ఇంట్లో ఉంచారు. కలిసి బతకాలని కలలు గన్న వారు అది సాధ్యం అయ్యేలా లేదని.. కలిసి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. రాత్రి అందరూ నిద్రపోయాక యువకుడు అత్త దగ్గరికి వెళ్లాడు. ఇద్దరూ కలిసి దగ్గర్లో ఉన్న సోన్ నది వంతెన దగ్గరకు వెళ్లారు. అర్ధరాత్రి లేచి చూసిన తండ్రి కుమార్తె కనిపించలేదు. వెంటనే మిగిలిన బంధువులతో కలిసి వెతకడం ప్రారంభించారు. పోలీసులకు కూడా సమాచారమిచ్చారు.
కొల్దహా బ్రిడ్జి కింద యువతి, యువకుడు స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నారని కొందరు డయల్ 100కు సమాచారమిచ్చారు. ఆ జంట ఆత్మహత్య చేసుకోవడానికి 60 అడుగుల ఎత్తైన వంతెన నుంచి దూకినట్లు భావించారు. పోలీసులు ఆ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బంధువులు ఆస్పత్రికి వెళ్లారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ ఇద్దరూ చదువు మానేశారని స్థానికులు తెలిపారు.