హైదరాబాద్‌ని డ్రగ్ ఫ్రీ సిటీగా మారుద్దామని ఒక పక్క పోలీసులు కలలు కంటుంటే.. కొంతమంది పోలీసుల కళ్ళు కప్పి డ్రగ్స్ దందాలు నిర్వహిస్తున్నారు. ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహిస్తూ డ్రగ్ ముఠాలని అంతమొందిస్తున్నారు. తాజాగా పోలీసుల కళ్ళు కప్పి ప్లాట్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ దొమ్మరాజు గోపీకృష్ణ యథేచ్చగా డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. హఫీజ్‌పేట్ గోకుల్ ప్లాట్స్‌లో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తుండగా గోపీకృష్ణను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిషేధిత ఎండిఎంఏ డ్రగ్ ట్యాబ్లెట్లను ఓ వ్యక్తికి విక్రయిస్తుండగా ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని మీద ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అతని వద్ద నుండి 55 వేల రూపాయల విలువ చేసే పది నిషేధిత డ్రగ్ ట్యాబ్లెట్లు, హ్యాష్ ఆయిల్, ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గోవాలో కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.