10 ఏళ్ల క్రితం వరకు చదువు అంటే.. టీచర్లతో దెబ్బలు తినటం ప్రధానంగా ఉండేది. సరిగా చదవకపోతే టీచర్లు పిచ్చపిచ్చగా కొట్టేవారు. ఎన్ని దెబ్బలు తిన్నా వారిపై తిరగబడటం జరిగేది కాదు. కానీ, ప్రస్తుతం కాలం మారింది. టీచర్లంటే పిల్లలకు లెక్కలేకుండా పోయింది. తాము ఏం చేసినా టీచర్లు గమ్మునుండాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమను కొట్టే టీచర్లపై దాడి చేసే విద్యార్థులు చాలా మంది ఉన్నారు. నిత్యం ఏదో ఒక చోట ఉపాధ్యాయులపై దాడి చేసే విద్యార్థుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, కొంత మంది విద్యార్థులు గర్భంతో ఉన్న ఉపాధ్యాయురాలి మీద దాడి చేశారు. స్కూల్లోనే ఆమెతో తప్పుగా ప్రవర్తించారు. ఈ సంఘటన అస్సాంలో ఆసల్యంగా చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అస్సాంలోని డిబ్రూఘర్ జిల్లాలో జవహార్ నవోదయ విద్యాలయం ఉంది. ఇందులో పదవి తరగతి చదివే వ్యక్తి చదువులో వెనకబడి ఉండేవాడు. అతడి ప్రవర్తన కూడా సరిగా ఉండేది కాదు. ఆదివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చరిత్ర ఉపాధ్యాయురాలు సదరు విద్యార్థి గురించి అతడి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. అతడి ప్రవర్తన బాగోలేదని అంది. అందరి ముందు తనను దుర్మార్గుడిగా చూపించటంతో ఆ విద్యార్థికి కోపం వచ్చింది. సమావేశం అయిపోయిన తర్వాత తన స్నేహితులతో కలిసి ఓ మీటింగ్ పెట్టుకున్నాడు.
అందరినీ కూడగట్టుకుని ఉపాధ్యాయురాలిపైకి దాడికి దిగాడు. కొంతమంది ఆమె జట్టుపట్టుకుని లాగారు. 5 నెలల గర్భిణి అని చూడకుండా దారుణంగా ప్రవర్తించసాగారు. ఇది గమనించిన తోటి ఉపాధ్యాయులు, పాఠశాలలోని బాలికలు ఆమెను రక్షించారు. అయితే, గర్బం కారణంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె.. వారి దాడి కారణంగా భయపడిపోయి స్ప్రహ కోల్పోయింది. ఉపాధ్యాయులు ఆమెను వైద్యశాలకు తరలించారు. దీనిపై పాఠశాల యజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 10,11 తరగతులకు చెందిన విద్యార్థులు ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు.