ప్రేమ.. దీని కోసం ప్రేమికులు ఎంతకైన తెగిస్తారు. అవసరమైతే రక్తపాతాలు సృష్టించడానికి కూడా వెనకాడరని మనం ఎన్నో సందర్భాల్లో తెలుసుకున్నాం. ఇదిలా ఉంటే ఓ ప్రియుడు మాత్రం.. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీని కోసం అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ పెళ్లి ఖర్చులకు మాత్రం చేతిలో చిల్లి గవ్వలేదు. ఈ క్రమంలోనే ప్రియుడికి ఏం చేయాలో తోచలేదు. ఎలాగైన సరే డబ్బు కూడబెట్టాలని అనుకున్నాడు. ఇక చేసేదేం లేక చివరికి దొంగగా మారి రూ.19 లక్షలు కొట్టేశాడు. తాజాగా వెలగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ప్రియుడు డబ్బు ఎలా దొంగిలించాడు? ఎక్కడ దొంగిలించాడనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అస్సాంకు చెందిన దీపోంకర్ అనే యువకుడు ఓ నోమోసుందర్ విల్సన్ అనే గార్డెన్ లోని ఓ ఏటీఎంలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాడు. అలా కొంత కాలం పాటు ఆ యువకుడు అక్కడే నమ్మకంగా పని చేస్తూ ఏటీఎం డిపాజిట్ సిబ్బందితో కూడా స్నేహంగా మెలిగాడు. ఇక అసలు విషయం ఏంటంటే? దీపోంకర్ స్థానికంగా ఉన్న ఓ అమ్మాయిని గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా అతడిని ప్రేమించింది. దీంతో ఇద్దరు కొంత కాలం పాటు పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రియుడు దీపోకంర్ ఇటీవల తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ అతని జేబులో చిల్లిగవ్వ లేదు.
ఈ క్రమంలోనే దీపోంకర్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అతనికి ఓ ఆలోచన వచ్చింది. అదే దొంగతనం. అది ఎక్కడో కాదు.. తాను పని చేస్తున్న ఏటీఎం సెంటర్ లోనే దొంగతనం చేయాలనుకున్నాడు. ఇందు కోసం ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన సిబ్బందితో నమ్మకాన్ని ఏర్పరుచుకున్నాడు. దీంతో వాళ్ల ద్వారా ఐడీ, పాస్ వార్డ్ అన్ని తెలుసుకున్నాడు. ఇక ఆలస్యం చేయని దీపోంకర్ ఇటీవల రాత్రిపూట ఏటీఎంలో డిపాజిట్ చేసిన రూ.19.96 లక్షలను దొంగిలించాడు. అనంతరం ఆ డబ్బును అంతా తీసుకుని చాపర్ ముఖకు చేరుకుని అక్కడే తలదాచుకున్నాడు. అయితే ఏటీఎం చోరీ కావడంతో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడు ఎవరో కాదు.., ఇక్కడ పని చేసే సెక్యూరిటీ గార్డేనని తెలుసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అతని వద్ద ఉన్న రూ.14.20 లక్షలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.