చెట్టంత ఎదిగిన కొడుకు చేతికి అందివస్తాడని.. ఆ తల్లిదండ్రులు ఆశించారు. త్వరలోనే మంచి ఉద్యోగం సంపాదించి.. తమకు తోడుగా ఉంటాడని భావించారు. ఎదిగిన కొడుకును చూసి మురిసిపోయారు. అయితే ఆ తల్లిదండ్రులు ఆశలు.. మధ్యలోనే ఆవిరయ్యాయి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న యువకుడు.. జీవితం మీద ఆశ కోల్పోయి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆ కుర్రాడు రాసిన సూసైడ్ లెటర్ ప్రతి ఒక్కరి చేత కంటతడిపెట్టిస్తోంది. ఈ విషాదకర సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
కర్నూలు పట్టణంలోని గీతామందిర్ ప్రాంతంలో సాయిరాం, శకుంతలమ్మ అనే దంపతులు నివాసముంటున్నారు. ఇక సాయిరాం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తుండగా.. శకుంతలమ్మ పట్టణంలోని వీవర్స్ కాలనీలోని జెడ్పీ హైస్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఇక ఈ దంపతులుకు ఇద్దరు కుమారులు సాయి వెంకట్(24), దిలీప్ ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు సాయివెంకట్ బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసి.. ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.
ఇక రెండో కుమారుడు దిలీప్ వైస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వెటర్నరీ కాలేజీలో చదువుతున్నాడు. ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్వహించిన టెట్ పరీక్షలో సాయివెంకట్ మంచి మార్కులు సాధించాడు. ప్రస్తుతం పోటీ పరీక్షల కోసం చదువుతున్నారుడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తండ్రి డ్యూటీకి, తల్లి శకుంతలమ్మ హైదరాబాద్‌లో బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయివెంకట్.. వంట గదిలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన తండ్రి ఇంట్లో సాయి వెంకట్ మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ వెంనటే తేరుకుని కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు జరిగిన దారుణాన్ని గమనించారు. తండ్రి సాయిరాంని ఓదార్చి.. ధైర్యం చెప్పారు. ఆ తర్వాత దీని గురించి పోలీసులు తెలపడంతో వారు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేతికి వచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక ఈ సందర్భంగా సాయివెంకట్ రాసిన సూసైడ్ నోట్.. ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. లేఖలో అతడు ఇలా రాసుకొచ్చాడు.. ‘‘అమ్మా, నాన్న, నా చిట్టి తమ్ముడు మీ అందరికీ నా క్షమాపణలు. ఎందుకంటే మీరు ఈ లేఖను చదివే సమయానికి నేను మీతో ఉండకపోవచ్చు. కారణం నా ఆరోగ్య సమస్య. నాకు ఇక దీనితో పోరాడే ఓపిక లేదు. ఇప్పటికి ఆరు సంవత్సరాలు అయ్యింది. ఎన్నో సార్లు ఈలోకాన్ని విడిచి పోదామనుకున్నాను. ధైర్యం ఉన్నా ఆ పని చేయకపోవడానికి కారణం మీరు. ఇంత కాలం కష్టపడి పెంచిన తల్లిదండ్రులకు ఉపయోగపడలేకపోతున్నాననే భావన నన్ను ఆపేస్తూ ఉండేది. ఏదో ఒక రోజు నాది అవుతుందిలే అనుకుని పోరాడాను. కానీ ఆరోజు ఎప్పటికీ నా జీవితంలో రాదని అర్థం అయ్యింది. ఒక పక్క జీవించాలని ఉన్నా.. అది నయం కావడానికి ఎంత సమయం పడుతుందో నాకు అర్థం కావడం లేదు. అది నయం అవుతుందన్న భావన కూడా నా దరి చేరడం లేదు. మరో వైపు మీకు ఏ రకంగాను ఉపయోగపడలేకపోతున్నా. నా విచిత్రమైన జీవన అలవాట్లతో మిమ్మల్ని బాధపెట్టనూ లేను’’ అని రాసుకొచ్చాడు.
‘‘పోనీ ఈ ఆరోగ్య సమస్యకు ఏదైనా చికిత్స తీసుకుంటే నయం అవుతుందా.. అని అంటే నాకు ఆ ఆశ కూడా శూన్యం. ఓ సారి హాస్పిటల్‌లో చూపించాను. డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చాడు. అయినా ఫలితం లేదు. ఇక నాకు నమ్మకం పోయింది. జీవించాలనే ఆశ సన్నగిల్లింది. నేను బతకలేక వెళ్లిపోవడం లేదు అమ్మా.. బతికి మిమ్మల్ని బాధ పెట్టలేక పోతున్నా.. ఐ లవ్ యూ అమ్మా, నాన్న, తమ్ముడు’’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని మృతి చెందాడు సాయివెంకట్. చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా అర్థాంతరంగా జీవితాన్ని ముగించడంతో ఆ తల్లిదండ్రుల బాధను వర్ణించలేకుండా ఉంది.
అమ్మా నాన్న.. ఐ లవ్ యూ.. నాకిక పోరాడే ఓపిక లేదు! pic.twitter.com/1ytsicMoQi
— Sekhar Rambo (@RamboSekhar) October 11, 2022