పెళ్లి బంధంతో నూతన జీవితంలోకి అడుగుపెట్టారు. కష్టసుఖాల్లో కలిసే ఉంటామని బాసలు చేసుకున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని ఊహించుకున్న వారిని విధి బలి తీసుకుంది. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన వివరాలు..
రెండు రోజుల క్రితమే ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. పచ్చని పందిరిలో బంధుమిత్రుల సమక్షంలో మంగళ వాయిద్యాల మోతలో.. వేద మంత్రాల సాక్షిగా వారిద్దరూ ఒక్కటయ్యారు. కష్టసుఖాల్లో కలిసే ఉంటామని బాసలు చేసుకున్నారు. నిండు నూరేళ్లు కలిసి ఉంటామని నిర్ణయించుకున్న వారు.. కాళ్ల పారాణి ఆరకముందే.. అనంత లోకాలకు వెళ్లారు. రెండు రోజుల క్రితమే పెళ్లితో ఒక్కటయిన ఆ జంట.. రోడ్డు ప్రమాదంలో ఒక్కటిగానే కళ్లు మూశారు. ఊహించని ప్రమాదంతో.. బంధుమిత్రల కోలాహలంతో సందడిగా ఉన్న పెళ్లి ఇంట్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. కొత్త జీవితం ప్రారంభించి.. నిండు నూరేళ్లు సంతోషంగా బతుకుతారు అనుకున్న బిడ్డలు పెళ్లైన రెండు రోజులకే ఇలా విగతజీవులు అవ్వడం చూసి ఆ తల్లిదండ్రులు పిచ్చి వాళ్లు అయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్ ఇచ్ఛాపురంలో చోటు చేసుకుంది. అత్తవారింటికి వెళ్తున్న నంవదంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇచ్ఛాపురం పట్టణంలోని బెల్లుపడ కాలనీలో నివాసం ఉంటున్న గవలపు వేణు అలియాస్ సింహాచలం(26) స్థానికంగా ఉన్న ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి బ్రహ్మపురకు చెందిన సుభద్ర అలియాస్ ప్రవల్లిక(23)తో వివాహం నిశ్చయించారు. ఫిబ్రవరి 10న సింహాచలం క్షేత్రంలో బంధుమిత్రలు సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఫిబ్రవరి 12 ఆదివారం నాడు ఇచ్ఛాపురంలో విందు ఏర్పాటు చేశారు. బంధుమిత్రులు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు.
పెళ్లి వేడుకలు ముగియడంతో.. సోమవారం నూతన దంపతులు అత్తవారింటికి వెళ్లేందుకు బైక్ మీద ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో గొళంత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఓ ట్రాక్టర్.. వేణు, సుభద్ర ప్రయాణిస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇక సుభద్ర అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన వేణను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
నవదంపుతుల రాక కోసం అక్కడ బ్రహ్మపురలో సుభద్ర తల్లిదండ్రులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బిడ్డ, అల్లుడి రాక కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పుడో మరో నిమిషంలోనే వారు ఇంటికి చేరుకుంటారు అని ఎదురు చూస్తున్న తరుణంలో పిడుగు లాంటి వార్త వారి చెవిన పడింది. రోడ్డు ప్రమాదంలో తమ బిడ్డ, అల్లుడు మృతి చెందారని తెలిసి సుభద్ర తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కాళ్ల పారాణి ఆరక ముందే తమ బిడ్డను కడుపును పెట్టుకున్నావ్ కదరా దేవుడా అంటూ ఏడవసాగారు.
ఇక వేణు తండ్రి గతంలోనే చనిపోగా.. అన్నయ్య, అక్క, తల్లితో కలిసి నివసిస్తున్నాడు. పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో కలకాలం సంతోషంగా జీవించాల్సిన కొడుకు ఇలా పెళ్లైన రెండు రోజులకు అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్నటి వరకు పెళ్లి సందడితో కళకళలాడిని ఇంట ఇలా చావు బాజాలు మోగుతాయని ఊహించలేదు అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. మరి ఈ దుర్ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.