లోన్ యాప్‌ల కారణంగా మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తరచుగా ఎవరో ఒకరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీసుకున్నాడు.
ఈ మధ్యకాలంలో లోన్ యాప్ ఆగడాలు ఆందోళన కలిగిస్తున్నాయి. లోన్ యాప్ వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నా వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. పోలీసులు, అధికారులు ఎన్ని కేసులు పెట్టినా.. అరెస్టులు చేసినా.. రుణ యాప్‌ల వేధింపులు మాత్రం తగ్గడం లేదు. తాజాగా, లోన్ యాప్ వేధింపుల తాళలేక ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అన్నమయ్య జిల్లా బి. కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెకు చెందిన రైతు జయరామిరెడ్డి కుమారుడు ఎస్. శ్రావణ్ కుమార్ రెడ్డి. అతడు కొన్ని నెలల క్రితమే బీటెక్ పూర్తి చేశాడు. ఏడాది కాలం నుంచి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాప్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. శ్రావణ్ ఆరు నెలల క్రితం తన అవసరాల కోసం లోన్ యాప్‌లో అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పులో రూ 3.50 లక్షల వరకూ చెల్లించాడు. అయితే, అప్పు తీరుస్తున్నా కూడా యాప్ నిర్వహకులు వేధింపులు పెడుతూ వచ్చారు. అసభ్యకర తిట్లు తిట్టారు. దీంతో శ్రావణ్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఎలాగైనా మొత్తం అప్పు తీర్చేయాలని భావించాడు. తండ్రికి ఫోన్ చేసి రూ.4లక్షలు కావాలని అడిగాడు.
వారం రోజులు ఆగు సర్దుబాటు చేసి పంపిస్తానని తండ్రి జయరామిరెడ్డి చెప్పాడు. ఈ క్రమంలోనే మే26 న డబ్బు ఇచ్చేందుకు కొడుకుకు కబురు పంపాడు. ఇంతలోనే అతనికి ఏమనిపించిందో శ్రావణ్ హైదరాబాద్ నుంచి తన బంధువుల ఊరైన మెురంపల్లెకు వెళ్లాడు. ఈ సమస్యకు చావే పరిష్కారమనుకున్నాడు. ఇంటి కిటీకి కమ్మీలకు బుధవారం సాయంత్రం ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మరుసటి రోజు స్థానికులు శ్రావణ్ శవాన్ని గమనించారు. అతడి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రావణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.