సయ్యద్ ఆంధ్రానుంచి బెంగళూరు వచ్చాడు. తన మిత్రుడు షేక్ ఆయూబ్‌తో కలిసి చెయ్యకూడని పనులు చేయటం మొదలుపెట్టాడు. తర్వాత పాపం పండి పోలీసులకు చిక్కాడు.
అతను బాడీ బిల్డింగ్‌లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించాడు. మిస్టర్ ఆంధ్రాగా టైటిల్ కూడా గెలుచుకున్నాడు. అలాంటి వ్యక్తి బెంగళూరులో చెయ్యకూడని పనులు చేస్తూ పోలీసులకు దొరికి పోయాడు. ప్రస్తుతం జైలు పాలై ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఏమా క్రైం స్టోరీ.. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 34 ఏళ్ల సయ్యద్ భాషా బాడీ బిల్డింగ్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. మిస్టర్ ఆంధ్రాగా టైటిల్ కూడా గెలుచుకున్నాడు. అలాంటి వ్యక్తి బెంగళూరుకు వెళ్లాడు. పని కోసమో.. ఉద్యోగం కోసమో కాదు.. దొంగతనాలు చేయటానికి. బెంగళూరులోని ఓ లాడ్జీలో తన మిత్రుడు షేక్ అయోబ్‌తో దిగిన సయ్యద్ దొంగతనాలకు ప్రణాళికలు రచించాడు.
ఇద్దరూ కలిసి నగరంలోని వీధి వీధి తిరిగేవారు. బైకులను దొంగలించేవారు. అలా దొంగిలించిన బైకుపై చైన్ స్నాచింగ్‌లు చేసేవారు. చైన్ స్నాచింగ్ తర్వాత బైకును ఓ చోట వదిలేవారు. ఆటోలో అక్కడినుంచి వెళ్లిపోయేవారు. ఆ తర్వాత దొంగిలించిన చైన్‌ను అమ్మి సొమ్ము చేసుకునేవారు. ఇలా పలు దొంగతనాలు చేశారు. కొద్దిరోజుల క్రితం గిరినగర పోలీస్ స్టేషన్ పరిథిలో జానకీ అనే మహిళ చైన్‌ను దొంగతనం చేశారు. ఈ సారి తన సొంత బైకు తీసుకుని సయ్యద్ దొంగతనానికి వచ్చాడు. దొంగతనం చేసి పారిపోయే తొందరలో బైకును అక్కడే వదిలేసి పారిపోయాడు. బాధితురాలు చైన్ స్నాచింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అతడు తన బైకును అక్కడే వదిలి పారిపోయినట్లు గుర్తించారు. ఆ బైకు కోసం సయ్యద్ మళ్లీ వస్తాడని పోలీసులు భావించారు. అతడ్ని పట్టుకోవటానికి ఓప్లాన్ వేశారు. జీపీఎస్ ట్రాకర్‌ను బైకుకు అంటించారు. వారు ఊహించినట్లుగానే సయ్యద్ బైకు కోసం వచ్చాడు. బైకును తీసుకుని వెళ్లిపోయాడు. జీపీఎస్ యాక్టివేట్ అవ్వటంతో అతడు ఎక్కడికి వెళ్లాడో పోలీసులకు తెలిసింది. సయ్యద్ ఉండే ప్రాంతానికి వెళ్లిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు షేక్ అయూబ్‌ను కూడా అరెస్ట్ చేశారు. మరి, మిస్టర్ ఆంధ్రా స్థాయినుంచి దొంగగా మారిన సయ్యద్ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.