అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అన్న వరుస అయ్యే ఓ యువకుడు చెల్లిని గత కొంత కాలం నుంచి ప్రేమించాలని వెంటపడ్డాడు. ఆ యువతి నిరాకరించడంతో స్కూటీపై వెళ్తున్న ఆ యువతిని వరసకు సోదరుడు అయ్యే యువకుడు కారుతో వెనక నుంచి ఢీ కొట్టాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కల్యాణదుర్గంలో భాస్కర్, మైథిలి ఇద్దరు నివాసం ఉంటున్నారు. వీరు ఇద్దరు వరసకు అన్నా, చెల్లెలు. ఈ కారణంగా మైథిలి సోదరుడే కదా భాస్కర్ తో మాట్లాడుతుండేది. కానీ భాస్కర్ మాత్రం వావివరసలు మరిచి కాస్త బరితెగించాడు.
భాస్కర్ మైథిలి మనసు పడ్డాడు. ఇదే విషయాన్ని ఓ సారి మైథిలికి కూడా చెప్పాడు. కానీ వరుసకు అన్నయ్య అవ్వడంతో మైథిలి భాస్కర్ ప్రేమను నిరాకరించింది. దీంతో ఎలాగైన మైథిలిని తన ముగ్గులోకి దింపేందుకు భాస్కర్ అనేక ప్రయత్నాలు చేశాడు. ఇటీవల కూడా భాస్కర్ మరోసారి మైథిలిని ప్రేమించాలని అదే పనిగా వెంటపడ్డాడు. కానీ ఎంతకు కూడా భాస్కర్ ప్రేమను మైథిలి అంగీకరించలేదు. ఇక కోపంతో ఊగిపోయిన భాస్కర్ ఎలాగైన మైథిలిని అంతమొందించాలని అనుకున్నాడు.
ఇందులో భాగంగానే కంబదూరు మండలం బోయలపల్లిలో మైథిలి స్కూటీపై వెళ్తుండగా గమనించి వెనకాల నుంచి కారుతో వచ్చి ఢీ కొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రమాదంలో మైథిలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు హుటాహుటిన మైథిలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు భాస్కర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.