ఈజీ మనీ కోసం ఆశపడి ఓ ముఠా అక్రమ మార్గాన్ని ఎంచుకుంది. క్రిమినల్ ఐడియాలతో బతికుండగానే చంపేసి.. ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
డబ్బు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. శ్రమ, తెలివి, ప్రతిభను నమ్ముకుంటే ఏదైనా సాధించొచ్చు. కష్టపడి అంచెలంచెలుగా ఎదగొచ్చు. దీనికి ఎంతోమందిని ఉదాహరణగా చెప్పొచ్చు. స్వయం కృషితో పేదరికం నుంచి కోట్లకు పడగలెత్తిన వారు ఎందరో ఉన్నారు. అయితే కొందరు మాత్రం అడ్డదారుల్లో ఉన్నత స్థాయికి చేరుకుందామని అనుకుంటారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని తప్పులు చేస్తూ పోతారు. ఓ ముఠా అలాగే అనుకుంది. వారంతా వివిధ రకాల పనులు చేసుకుంటూ ఉండేవారు. డబ్బు సంపాదన టార్గెట్గా అంతా ఒక్కటయ్యారు. దీని కోసం ఏకంగా బతికున్న వారినే.. మరణించినట్లు సృష్టించడం మొదలుపెట్టారు. ఈ విషయం వారి కుటుంబ సభ్యులకూ తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
అనంతపురం జిల్లా, తాడిపత్రి నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తులు బతికి ఉండగానే.. వారు చనిపోయినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికేట్, కుటుంబ సభ్యుల సర్టిఫికేట్లు, ఫొటోలు మార్పిడి చేసిన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లతో ఇన్సూరెన్స్ క్లైమ్ చేసిందో ముఠా. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా దగ్గర నుంచి కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నామని తాడిపత్రి డీఎస్పీ చైతన్య తెలిపారు. తాడిపత్రిలోని హరిజనవాడకు చెందిన గిత్త రంగనాయకులు ఒక ఇన్సూరెన్స్ సంస్థలో పని చేసేవాడు. శాంతమ్మ అనే మహిళకు రూ.20 లక్షలు ఇన్సూరెన్స్ చేసి.. కంపెనీని మోసం చేశాడు రంగనాయకులు. శాంతమ్మ బతికుండగానే ఆమె మృతి చెందినట్లు నకిలీ ధృవపత్రం సృష్టించి డబ్బులు కాజేశాడు.
శాంతమ్మ అనే మహిళ బతికే ఉందని.. ఆమె డబ్బులు కాజేయాలనే ఏజెంట్ ఇలా చేశాడని ఇన్సూరెన్స్ అధికారులు విచారణలో గుర్తించారు. దీంతో ఆ ఇన్సూరెన్స్ ఆఫీసర్స్ తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇన్వెస్టిగేషన్లో రంగనాయకులతో పాటు గురుశేఖర్, చింతలయ్య గారి రంగనాయకులు, చంద్రశేఖర్, గౌర్ స్పీర్ అంతా కలసి ఈ మోసం చేశారని తేలింది. వారంతా కలసి నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి మోసగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి దగ్గర నుంచి కంప్యూటర్లు, ప్రింటర్లు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చామని డీఎస్పీ చైతన్య పేర్కొన్నారు.