క్షణికావేశంలో ఓ వ్యక్తి చేసిన తప్పుకు చిన్నారి బలైంది. ఈ కేసులో కోర్టు నిందితుడికి ఏకంగా 100 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు..
కోపం మంచిది కాదని పెద్దలు అంటుంటారు. కోపం మనిషికి శత్రువు లాంటిదని.. దాన్ని ఎంత నియంత్రిస్తే అంత మంచిదని చెబుతుంటారు. అయితే ఓ వ్యక్తి కోపాన్ని నియంత్రణలో పెట్టలేక క్షణికావేశంలో అనుకోకుండా హత్య చేసేశాడు. దీంతో అతడు భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. తాను ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా అతడి కోపానికి ఒక చిన్నారి బలైంది. దీంతో కోర్టు అతడికి ఏకంగా వందేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ష్రేవ్పోర్ట్కు చెందిన జోసెఫ్ లీ స్మిత్ అనే వ్యక్తి సూపర్ 8 లగ్జరీ హోటల్లోని పార్కింగ్ వద్ద ఒక వ్యక్తితో గొడవకు దిగాడు. పట్టరాని కోపంతో ఊగిపోయిన స్మిత్.. అవతలి వ్యక్తి మీద ఒక హ్యాండ్ గన్ను ఎక్కుపెట్టాడు. దీంతో అనుకోకుండా అందులో నుంచి బుల్లెట్ విడుదలైంది. అయితే అవతలి వ్యక్తి బుల్లెట్ బారి నుంచి తప్పించుకున్నాడు.
కానీ దుదరృష్టవశాత్తు ఆ బుల్లెట్ కాస్తా హోటల్ గదిలో ఆడుకుంటున్న భారత సంతతికి చెందిన ఒక ఐదేళ్ల చిన్నారి తలలోకి దూసుకుపోయింది. దీంతో మయా పటేల్ అనే ఆ బాలిక అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆ చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ మూడ్రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఈ నెల 23న ప్రాణాలు విడిచింది చిన్నారి. దీంతో నిందితుడు స్మిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆ వ్యక్తికి ఎలాంటి పెరోల్ లేదా శిక్ష తగ్గింపునకు చాన్స్ లేకుండా 60 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. అలాగే దారుణమైన ఘటనకు బాధ్యుడిగా 20 ఏళ్లు, బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకు మరో 20 ఏళ్లు కలిపి మొత్తంగా 100 ఏళ్ల శిక్ష విధించింది. కాగా, ఈ కేసులో నిందితుడైన స్మిత్‌కు కొంత నేర చరిత్ర ఉందని తెలుస్తోంది.