మోసగాళ్లు పెరిగిపోతున్నారు. కొత్త తరహా మోసాలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నగరంలో తిమింగళం వాంతి పేరుతో మోసానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తిమిగలం వాంతిని అంబెర్ గ్రిస్ అని పిలుస్తారు. ఇది ఒక విలువైన పదార్థం. దీన్ని బ్యూటీ ఉత్పత్తులు, పర్‌ఫ్యూమ్‌ల తయారీలో వాడుతారు. మేలైన అంబెర్ గ్రిస్ కు వేడి తగిలితే వెంటనే కరిగిపోతుంది. చల్లార్చిన తరువాత మళ్లీ గట్టిపడుతుంది. అంబెర్ గ్రిస్ ను తేలియాడే బంగారం లేదా సముద్రపు నిధి అంటారు. స్పర్మ్ వేల్ జాతి తిమింగళాల జీర్ణ వ్యవస్థ దీన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది తిమింగళాల జీర్ణాశయంలోకి పదునైన వస్తువులు సులభంగా వెళ్లేలా, అవి జీర్ణమయ్యేలా చేస్తుంది.
ఈ స్రావాలు బయటకు వచ్చిన తరువాత గడ్డకట్టుకుపోతాయి. మొదట్లో ఇవి దుర్వాసనను కలిగి ఉంటాయి. కానీ పూర్తిగా ఎండిపోయిన తరువాత సువాసనలు వెదజల్లుతుంది. అందుకే దీనికి సౌందర్య ఉత్పత్తుల్లో, పెర్ఫ్యూమ్ పరిశ్రమలో దీనికి మంచి విలువ ఉంటుంది.అంబెర్ గ్రిస్ పదార్థం తమ వద్ద ఉందని నకిలీ పదార్థాన్ని అమ్మేందుకు ఓ ముఠా ప్రయత్నించింది. ఎలక్ట్రానిక్స్‌లో అతికించేందుకు వాడే గమ్ లాంటి పదర్థాన్ని అంబర్‌గ్రిస్‌గా చూపుతూ మోసాలకు పాల్పడింది. ఖైరతాబాద్‌లోని ఎస్‌బీఐ వీధిలో ఓ గది కార్యాలయంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నకిలీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
సులేమాన్ స్టోన్ ఉందని, దానిలో మహిమలు ఉన్నాయని చెబుతూ దాన్ని చేతిలో పట్టుకుంటే చేయి నరికినా ఏమీ కాదని నమ్మిస్తున్నారు. మరో అయస్కాంత ప్లేట్ ఉంది, అది బ్రిటన్ వారు వినియోగించారు, అది ఎంతో విలువైందని నకిలీ ప్లేటు చూపుతున్నారు. ఇప్పుటివరకు గుప్త నిధులు, రైస్ పుల్లింగ్ అంటూ జనాల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్న కేటుగాళ్లు.. తాజాగా తిమింగళం వాంతి పేరుతో కొత్త తరహా క్రైమ్‌కు తెరదీశారు.