కల్తీ, కల్తీ, కల్తీ.. ఎక్కడా చూసిన మొత్తం కల్తీనే. బియ్యం నుంచి తినే ఐస్ క్రీమ్ వరకు నోటికి రుచిగా ఉందని కల్తీ ఆహార పదార్థాలను తినేస్తున్నాం. ఇటీవల హైదరాబాద్ లో కల్తీ ఐస్ క్రీమ్ గుట్టు రట్టు అయిన విషయం తెలిసిందే.ఇది మరువక ముందే తాజాగా హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటపడింది.
అల్లం వెల్లుల్లి పేస్ట్.. ఇది లేనిదే ఎలాంటి కూరలు వండలేం. బిర్యాని, చికెన్, మటన్ ఇలా ఎన్నో రకాల వంటకాల్లో ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండి తీరాల్సిందే. లేకపోతే అస్సలు పని అవ్వదు. దీనినే ఆసరాగా చేసుకున్నారు కొందరు కల్తీ రాయుళ్లు. అవును మీరు విన్నది నిజమే. మొన్న ఇస్ క్రిమ్,నేడు అల్లం వెల్లుల్లి పేస్ట్. గుట్టు చప్పుడు కాకుండా జనాలు తినే ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ లో కొందరు కేటుగాళ్లు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ విక్రయిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కాటేన్ పారిశ్రామిక వాడలో కొందరు నిర్వాహకులు కల్తీ వెల్లుల్లి పేస్ట్ ను విక్రయిస్తున్నారు.
తక్కువ ధరకే వీటిని అమ్ముతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కుల్లిపోయిన అల్లం వెల్లుల్లితో పాటు రసాయనాలను వాడి కల్తీ పేస్ట్ ను తక్కువ ధరకే అమ్ముతున్నారు. అయితే ఈ నిర్వాహకులు ఈ దందాను గత కొన్నేళ్ల నుంచి గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆ కంపెనీపై దాడులు చేశారు. అయితే పోలీసుల దాడుల్లో వారికి దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. మిషన్ లలో కుల్లిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్, మురుగు నీరు ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు ఏకంగా 500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ కల్తీ దందాను నిర్వాహిస్తున్న ఇద్దరు నిందితులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.