కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. చివరికి చిన్న పిల్లలు తినే చాక్లెట్లను కూడా కల్తీ చేస్తున్నారు. అలా హానికర కెమికల్స్‌తో నకిలీ చాక్లెట్లు తయారు చేస్తున్న ఒక ముఠాను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
ఈ రోజుల్లో దేంట్లోనూ నాణ్యత ఉండటం లేదు. డబ్బులు కుమ్మరించినా క్వాలిటీ గగనమైపోయింది. ప్రతి దాంట్లోనూ కల్తీ వచ్చేసింది. ధనార్జన, స్వార్థంతో కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు పరిస్థితి తయారైంది. రోజువారీ ఉపయోగించే ఆహార పదార్థాలు కూడా కల్తీ అవుతున్నాయి. డబ్బులు సంపాదించాలనే ధ్యేయంతో ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా మార్కెట్లో సొమ్ము చేసుకుంటున్నారు. నెయ్యిలో పామాయిల్, నిల్వ ఉంచిన మాంసం, పండ్లకు రసాయన పూతలు.. ఇలా చెప్పుకుంటూ పోతే కల్తీ లీలలకు కొదవలేదు. ఆఖరుకు చిన్న పిల్లలు తినే చాక్లెట్లనూ కల్తీ చేసేస్తున్నారు.
తాజాగా రాజేంద్రనగర్, అత్తాపూర్‌లోని ఒక చాక్లెట్ పరిశ్రమపై ఎస్వోటీ పోలీసులు అటాక్ చేశారు. చిన్న పిల్లలు తినే చాక్లెట్లు, లాలీపాప్స్‌ను ప్రమాదకర రసాయనాలు వినియోగించి తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. డేంజరస్ కెమికల్స్‌తో నకిలీ చాక్లెట్లను తయారు చేస్తూ వాటికి బ్రాండెడ్ స్టిక్కర్లను అంటించి మార్కెట్లో దుర్మార్గులు సొమ్ము చేసుకుంటున్నారని గుర్తించారు. ప్రమాదకర రసాయనాలు, సిట్రిక్ యాసిడ్ పౌడర్, చక్కెర, ఇతర కెమికల్స్‌తో చాక్లెట్లు, లాలీపప్స్, పిప్పరమెంట్లు రూపొందించి.. వాటికి అందంగా ప్యాక్ చేసి బేగంబజార్‌లోని హోల్‌సేల్ వ్యాపారులకు అమ్ముతున్నట్లు ఎస్వోటీ పోలీసులు గుర్తించారు. షెడ్లోని ఈగలు, దోమలు, పురుగులు పడిన పానకంతోనే వీటిని తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఆ పరిశ్రమలోని పలు కెమికల్ బాటిల్స్, రంగు డబ్బాలు, 350 కిలోల చక్కెర, సిట్రిక్ యాసిడ్ పౌడర్, డ్రమ్ గ్లూకోజ్ లిక్విడ్, ఆరెంజ్ లిక్విడ్ ఫ్లేవర్, స్వీట్ ఆయిల్ బేస్డ్ పాలిష్ పౌడర్, మిక్సింగ్ మెషీన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంస్థ యజమాని అహ్మద్‌తో పాటు అక్కడ పనిచేస్తున్న కార్మికులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పరిశ్రమను సీజ్ చేసిన పోలీసులు.. నిందితులను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. తినే ఆహార పదార్థాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. జనాల ప్రాణాలతో చెలగాటమాడేలా కల్తీకి పాల్పడేవారు జైలు ఊచలు లెక్కించాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు.