భర్త మరణం తర్వాత ఆమె ఆ యువకుడితో ప్రేమలో పడింది. అతడే ఇక తన జీవితం అనుకుంది. తల్లి, అన్నను కాదని అతడితో పాటే వెళ్లింది. మూడేళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏమైందో ఏమో తెలియదు కానీ, ఇంట్లో ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఆదిభట్లలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని బాలాపూర్ మండలం లెనిన్‌నగర్‌కు చెందిన సరస్వతి అనే మహిళకు 13 ఏళ్ల క్రితం శివ అనే వ్యక్తితో పెళ్లయింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఓ కొడుకు పుట్టారు. దశాబ్ధం క్రితం శివ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.
ఇక అప్పటినుంచి సరస్వతి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తన పిల్లలను వసతి గృహంలో ఉంచి చదివిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు కుర్మల్‌గూడ రాజీవ్‌గృహకల్పకు చెందిన మహేందర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తల్లి, అన్నల మాటలు కాదని ఆమె అతడితో వెళ్లిపోయింది. మూడేళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. మహేందర్‌తో పెళ్లి అయిందని తల్లి, అన్నలకు చెప్పింది సరస్వతి. దీంతో వారు మిన్నకుండిపోయారు. అయితే, గత కొన్ని నెలలుగా మహేందర్, సరస్వతి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి.
కొద్దిరోజుల క్రితం ఇద్దరికీ గొడవ జరగటంతో ఆమె తన తల్లి దగ్గరకు వెళ్లిపోయింది. వారం క్రితం మళ్లీ మహేందర్ దగ్గరకు వచ్చింది. శనివారం ఇద్దరూ విగతజీవులుగా ఇంట్లో దర్శనం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నేలపై సరస్వతి, ఉరికి వేలాడుతూ మహేందర్ శవాలను గుర్తించారు. శవాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.