అబ్దుల్లాపూర్‌మెట్, నవీన్ హత్య కేసులో యువతిదే ప్రధాన పాత్ర అనే ఆరోపణలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. సదరు యువతి బంధువుగా చెప్పుకున్న ఓ వ్యక్తి మాట్లాడిన ఆడియో ఒకటి ప్రసుత్తం నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మొదటి నుంచి ఓ యువతి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆమె ప్రోద్భలంతోనే హరి.. నవీన్‌ను అత్యంత దారుణంగా హత్య చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హరి తండ్రి కూడా తన కుమారుడు ఒక్కడే ఈ దారుణానికి పాల్పడలేదని.. ఆ అమ్మాయి ప్రోత్సాహం కూడా ఉందని.. ఆమె పాత్రపై దర్యాప్తు చేయాలని పోలీసులను కోరాడు. సదరు యువతి మానసిక పరిస్థితిపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. హరి.. నవీన్ శరీర భాగాల ఫొటోలను.. యువతికి పంపితే.. ఆమె సింపుల్‌గా ఓకే, గుడ్‌బాయ్ అని రిప్లై ఇవ్వడం చూసి.. ఆమె మూర్ఖురాలా.. లేక అమాయకురాలా.. అవేమైనా ఫ్రాంక్ ఫొటోలు అనుకుందా ఏంటి అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ కేసులో యువతే ప్రధాన నిందితురాలు అనే ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో.. యువతి బంధువునంటూ ఓ వ్యక్తి మాట్లాడిన ఆడియో ఒకటి ప్రస్తుతం వైరలవుతోంది. దీనిలో సదరు వ్యక్తి.. ‘‘అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ హత్య జరిగిందని.. సదరు యువతి వల్లనే ఈ దారుణం చోటు చేసుకుందని ప్రచారం జరుగుతోంది. నేను యువతి బంధువుని. మా అమ్మాయి, హరి, నవీన్ ముగ్గురు ఇంటర్‌లో ఫ్రెండ్స్ మాత్రమే. దీనిలో ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు. నవీన్, హరిల మధ్య గొడవ కారణంగానే ఈ హత్య జరిగింది. ఈ కేసుకు మా అమ్మాయితో ఏ సంబంధం లేదు’’ అని తెలిపాడు.
‘‘దయచేసి ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయకండి. మీడియా సంస్థలు, సోషల్ మీడియా సైట్లకు ఒక్కటే చెబుతున్నాం. మా అమ్మాయి ఫొటో ప్రచురించి.. అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి ప్రచారాలు నమ్మకూడదు. ఆధారాలు లేకుండా మీడియా వారు ఆరోపణలు చేయకూడదు, ఫొటోలను రివీల్ చేయకూడదని కోరుతున్నాం. దర్యాప్తు సంస్థలు, పోలీసులు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. ఇది సెన్సిటీవ్ కేసు. అమ్మాయి పేరు, ఫొటోలు వాడకూడదని తెలిపారు. మేం కూడా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఆడియో వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.