తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో రోజు రోజుకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా యువతి ఫోన్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..
అబ్దుల్లాపూర్‌మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు హరిహరకృష్ణ.. నెలల ముందు నుంచే నవీన్ హత్యకు పక్కా పథకం రచించి.. దాన్ని అమలు చేశాడు. అత్యంత దారుణంగా స్నేహితుడు నవీన్‌ను హత్య చేసి.. అంతటితో ఆగక.. మృతుడి శరీరం నుంచి అతడి అవయవాలను వేరు చేసి.. వాటిని తన గర్ల్‌ఫ్రెండ్‌కు పంపించి.. రాక్షసానందం పొందాడు హరి. ఇక ఈ కేసులో యువతి పాత్ర కీలకంగా మారింది. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతోంది. ఈ నేరంలో యువతి పాత్ర కీలకం అని పోలీసులు భావిస్తున్నారు. ఇక హరి తండ్రి కూడా.. తన కుమారుడు ఒక్కడే ఇంత దారుణానికి పాల్పడలేడని.. దీనిలో యువతి పాత్ర కూడా ఉందని ఆరోపించాడు.
ఇక పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు యువతి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు పోలీసులు. ఫోన్‌లోని కాల్స్, మెసేజ్‌లను పరిశీలించగా.. పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. యువతి ఒకేసారి ఇద్దరితో ప్రేమాయణం నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక హరి యువతి పక్కనే.. ఉన్న సమయంలో నవీన్ చాలాసార్లు అమ్మాయికి ఫోన్లు చేసేవాడని, అది చూసి హరిలో అనుమానం బయలుదేరిందని.. ఎప్పటికైనా నవీన్ యువతికి చేరువవుతాడనే ఉద్దేశంతోనే ఇంత దారుణానికి పాల్పడ్డారని పోలీసులు అంటున్నారు. అంతేకాక నవీన్ ఇలాగే ఫోన్లు చేస్తే భవిష్యత్తులో ప్రియురాలు తనకు దక్కదని భావించిన హరి.. తమ ప్రేమకు అడ్డు తొలగించుకునేందుకు నవీన్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు.. యువతిని ప్రశ్నించడం చాలా ముఖ్యమని భావించిన పోలీసులు.. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ యువతి మాత్రం నోరుమెదపడం లేదు. పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు. ఇప్పటికే యువతిని సఖి కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ ఇప్పించారు. అయినా సరే ఆమె తీరులో మార్పు రావడం లేదని చెబుతున్నారు పోలీసులు. యువతి ఇప్పటి వరకు పోలీసుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చేయడం లేదని.. తనకు ఏమీ తెలియదని అంటుంది. ఇంత దారుణం జరిగినా.. అమ్మాయిలో పశ్చాత్తాపం కనిపించడం లేదని.. ఈ హత్య కేసును ఆమె చాలా తేలికగా తీసుకుందని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాక ఈ కేసుకు సంబంధించి తనను ఇబ్బంది పెడితే.. ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులనే బెదిరిస్తోంది యువతి. ఆమె తీరుతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
ఇక ఇప్పటికే నిందితుడు హరిహరకృష్ణను వారం రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు గురువారం అనుమతిచ్చింది. దాంతో పోలీసులు హరికృష్ణను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కానీ హరిహరకృష్ణ కూడా విచారణకు అసలు సహకరించడం లేదని.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తోంది. అటు నవీన్ ఫ్రెండ్ హాసన్‌ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.