ఇటీవల పలు చోట్ల ప్రేమోన్మాదులు మారణాయుదాలతో రెచ్చిపోతున్నారు. తమ ప్రేమను కాదంటే చంపడానికి కూడా సిద్దమైతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రేమోన్మాధుల దాడుల్లో ఎంతోమంది యువతులు ప్రాణాలు సైతం పొగొట్టుకున్నారు.
దేశంలో మహిళలపై ప్రతిరోజూ ఎక్కడో అక్కడ లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి సమయాల్లో సంగతి పక్కనబెడితే.. పట్టపగలు ఒంటరిగా మహిళలు బయట తిరగాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ మద్య కాలంలో కొంతమంది ఆకతాయిలు ప్రేమ పేరుతో యువతులను వేధిస్తున్నారు.. తమను కాదంలే బ్లేడ్, కత్తులతో దాడులకు ఎగబడుతున్నారు. తాజాగా ఓ యువతిపై ప్రేమోన్మాది రెచ్చిపోయి దాడి చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఓ విద్యార్థినిపై ప్రేమోన్మాది బ్లేడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో విద్యార్థిని తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు తారా కాలేజ్ లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అఖిల గా గుర్తించారు. ఇక విద్యార్థినిపై దాడి చేసిన యువకుడి పేరు ప్రవీణ్ గా గుర్తించారు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
గత కొంత కాలంగా ప్రవీణ్.. అఖిలను ప్రేమిస్తున్నా అంటూ వెంటపడసాగాడని.. తన ప్రేమను అంగీకరించకపోవడంతో నేడు అఖిల పరీక్షలు రాయడానికి కాలేజీకి రావడంతో మాటు వేసి బ్లేడ్ తో దాడికి యత్నించినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు బాధితురాలికి దూరపు బంధువు అవుతాడని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా తాము ఇద్దరం ప్రేమించుకున్నామని.. కొన్నిరోజులుగా తనను దూరంగా పెట్టడం వల్లనే ఈ పని చేసినట్లు నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.