తలచినదే జరిగినదా దైవం ఎందులకు.. జరిగినదే తలచితివా ఎదురులేదు నీకు.. అన్న సినిమా పాటలో ఎంతో అర్థం ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ముందే ఊహిస్తే మనకు దైవంతో పనేముంది. ఎవరి ప్రాణాలు ఎప్పుడు ఎలా గాల్లో కలిసిపోతాయో ఎవరికీ తెలీదు. అలా అనుకోకుండా జరిగిన ఘటన రెండు కుటుంబాల్లో ఆరని మంటలను రేపింది. నూరేళ్లు కలిసి ప్రయాణించాలనుకున్న ఒక జంటను విడదీసింది. పచ్చని సంసారాన్ని బుగ్గిపాలు చేసింది. చక్కగా వివాహం చేసుకుని శ్రీవారిని దర్శించుకోవాలని వచ్చిన ఆ నవ జంటలో వధువుని వరద రూపంలో మృత్యువు వెంటాడింది.
ఇదీ చదవండి: భారతీయుల రెండేళ్ల ఆయువును తినేసిన కరోనా మహమ్మారి!
కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం శ్రీవారిని దర్శించుకునేందుకు శుక్రవారం రాత్రి తిరుపతికి వచ్చింది. భారీ వర్షానికి వెంగమాంబ కూడలి వద్దనున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా వరద నీరు చేరింది. నీరు దాదాపు 8 అడుగులకు పైగా నిలిచి ఉంది. దారి గురించి అవగాహన లేని డ్రైవర్ తుఫాన్ వాహనాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. వాహనం ఒక్కసారిగా నీళ్లలోకి వెళ్లి మధ్యలో ఆగిపోయింది. వాహనం వరద నీటిలో చిక్కుకున్న విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌వీ విశ్వవిద్యాలయం పోలీసులు సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. వాహనంలో చిక్కుకున్న కుటుంబసభ్యులను ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు.
కారు నీటిలో పూర్తిగా మునిగిపోయి ఉండటంతో గాలి ఆడక నూతన వధువు అప్పటికే చనిపోయింది. కుటుంబంలోని మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే రుయాకి తరలించారు. వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. బాధిత కుటుంబం కర్ణాటకులోని రాయచూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. కొత్తగా పెళ్లైన జంట బంధువులతో కలిసి తిరుపతి దర్శనానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.