ఇటీవల దేశంలో గుండె పోటుతో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా వరుస గుండెపోటు మరణాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. అప్పటి వరకు మనతో మాట్లాడుతూ సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలుతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపు చనిపోతున్నారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా.. పెద్దా హఠాత్తుగా గుండెపోటుతో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. వ్యాయామం చేస్తూ కొందరు.. క్రీడలు ఆడుతూ కొందరు.. డ్యాన్స్ చేస్తూ మరికొంతమంది.. కారణాలు ఏవైనా అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు ఆకస్మాత్తుగా ప్రాణాలు వదిలేస్తున్నారు. మొన్నటి వరకు కరోనా అంటే భయపడేవారు.. ఇప్పుడు గుండెపోటు పేరు వినిపిస్తే చాలు భయంతో వణికిపోతున్నారు. తాజాగా ఓ ఉపాధిహామీ కూలి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మెదక్ జిల్లా దేవులపల్లి గ్రామానికి చెదిన చాకలి నాగరాజు.. వయసు 36 సంత్సరాలు. అతని భార్య విజయ, కుటుంబ సభ్యులు.. మరికొంత మంది గ్రామస్థులు శివారలోని ఈడిగోని కుంటలో ఉపాధి హామీ పనుల కోసం వెళ్లారు. పూడిక మట్టి తీసే పనల్లో నాగరాజు గడ్డపారతో తవ్వుతున్నాడు.. మరికొంతమంది కూలీలు మట్టి తీస్తున్నారు. పని ముగించుకొని ఇంటికి వచ్చే సమయంలో నాగరాజు కి ఛాతిలో విపరీతంగా నొప్పి వస్తుందని గట్టుమీద కూర్చుండిపోయాడు. వెంటనే తోటి కూలీలు, కుటుంబ సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్ ప్రభాకర్ కి సమాచారం ఇచ్చారు. వెంటనే అతను నాగరాజును గ్రామంలోని ఆర్ఎంపీ వద్దకు తీసుకు వెళ్లి చూపించాడు.
నాగరాజు పరిస్థితి అస్సలు బాగాలేదు పెద్దాసుపత్రికి తీసుకు వెళ్లాలని వైద్యుడు చెప్పడంతో వెంటనే నాగరాజుని ఆటోలో కౌడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది సీపీఆర్ చేశారు.. కానీ ఫలితం లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు సీపీఆర్ నిర్వహించినా ఎలాంటి చలనం లేకపోవడంతో నాగరాజు చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. నాగరాజు ఆటో నడుపుతూ.. కుటుంబ సభ్యులతో ఉపాధిహామీ పనులకు వెళ్తూ ఉండేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్యా పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు.