మనిషి వచ్చే సంపాదనతో తృప్తిగా ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఎప్పుడైతే స్థాయికి మించి కోరికలు ఉంటాయో… అప్పటి నుంచే కష్టాలు మొదలవుతాయి. అయితే కాస్తా ఎక్కువ కష్టపడి సంపాదిస్తే అనుకున్న కోరికల్లో కొన్ని అయినా తీర్చుకోవచ్చు. కానీ త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచన వస్తే మాత్రం చాలా నష్టం జరుగుతుంది. ఏదైనా ఆలోచించి అడుగు వేస్తే ఇబ్బంది లేదు. లేకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రాణాలు మీదకు వచ్చే పరిస్థితులు వస్తాయి. భార్యాపిల్లలతో హాయిగా జీవితం గడపాల్సిన ఓ వ్యక్తి.. ఆన్ లైన్ ట్రెడింగ్ లో పెట్టుబడులు పెట్టాడు. లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని చివరికి ఆత్మహత్య చేసుకుని కుటుంబాన్ని ఒంటరిని చేశాడు. సూర్యాపేటలో ఓ లాడ్జిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు ఖమ్మంకు చెందిన గుండెమీద రామలింగస్వామి(38)గా గుర్తించారు. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి ద్వారా రామలింగస్వామి క్రిప్టో యాప్ లలో పెట్టుబడులు పెడుతున్నాడు.
ఈ క్రమంలో ఆన్ లైన్ వ్యాపారంలో అతనికి భారీగా నష్టాలు వచ్చాయి. రామలింగస్వామి దాదాపు రూ.70 లక్షలు అప్పు చేశాడు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వారు కారు లాక్కొని, చెక్కులపై సంతకాలు పెట్టించుకున్నారు. ఆ తరువాత కూడా నిత్యం వారి నుంచి వేధింపులు వస్తున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బులు పోవడం, ఇన్వెస్టర్ల వేధింపులతో రామలింగస్వామి విసిగిపోయాడు. వారందరికీ దూరంగా ఉండాలని ఈ నెల 22 నుంచి సూర్యాపేటలో ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకొని ఉన్నాడు. ఈ క్రమంలో బుధవారం రామలింగస్వామి ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వారు వచ్చి తలుపులు పగలగొట్టి గదిలోకి వెళ్లి చూడగా.. రామలింగస్వామి బాత్ రూమ్ లో మృతిచెంది ఉన్నాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి వారు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఆన్ లైన్ ట్రేడింగ్ లో నష్టపోయి.. ప్రాణలు పోవటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.