Nellore: ప్రపంచమంతా టెక్నాలజీ యుగంలో పరుగులు తీస్తుంటే నేటికి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ అందులోనే మునిగిపోతున్నారు. పేద ప్రజల నమ్మకాన్ని ఆసరాగా ములుచుకుంటున్న అనేక మంది నకిలీ బాబాలు మంత్ర తంత్రాల నెపంతో అమాయక ప్రజలను నిండా మోసం చేస్తున్నారు. ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మిన ఎంతోమంది గ్రామీణ ప్రజలు శారీరకంగా, ఆర్థికంగా మోసపోతున్నారు. ఈ తాయత్తులు ధరిస్తే మీ తలరాత మారిపోతుందని, ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తే ఇంట్లో అంతా శుభం కలుగుతుందని ఇలా ఎన్నో కారణాలు చెప్పి లక్షల్లో సంపాదిస్తూ జనాలను పిచ్చివాళ్లను చేస్తున్నారు.
ఇదిలా ఉంటే భక్తి మైకంలో మునిగిపోయిన ఓ వ్యక్తి తన సొంత బిడ్డలపైనే ప్రయోగం చేశాడు. శాంతి పూజల నెపంతో పసిపిల్లలపై పైశాచికంగా వ్యవహరించిన ఘటన తాజాగా నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా.. ఆత్మకూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డిపల్లి గ్రామం. ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న వేణు అనే వ్యక్తికి పెళ్లై ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. అయితే వేణు భక్తి మైకంలో మునిగిపోయి ఎప్పుడూ పూజలు, మంత్రాలు అంటూ తెగ బిజీగా ఉండేవాడు.
ఇలాంటి లోకంలో తేలిపోతున్న వేణు ఇటీవల ఇంట్లో శాంతి పూజలు చేశాడు. ఇళ్లంతా కుంకుమ, పసుపులతో కూడిన ముగ్గును వేశాడు. ఆ ముగ్గు మధ్యలో తన ఇద్దరు పసిపిల్లలను కూర్చోబెట్టాడు. మంత్రాలు చదువుతూ పిచ్చిపట్టిన వాడిలా ఊగుతూ ఉన్నాడు. చేతి నిండా కుంకుమ తీసుకుని ఆ ఇద్దరు ఆడపిల్లల నోట్లో కొడుతూ అతిగా అరుస్తున్నాడు. ఇది గమనించిన కొందరు స్థానికులు అనుమానమొచ్చి ఏం జరుగుతుంది అంటూ చూశారు. కుంకుమతో వేసిన ముగ్గులో ఏడుస్తూ కూర్చున్న ఇద్దరు పిల్లలు కనిపించారు. వెంటనే తలుపులు పగలగొట్టి ఆ పిల్లలను అతని చెర నుంచి విముక్తి కలిగించారు.
దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తండ్రి పిచ్చి భక్తిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.