హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో అత్యంత ఘోర.. అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కేవలం వంద రూపాయల కోసం కక్కుర్తి పడి ఓ చిన్నారి ప్రాణం పోయేందుకు కారణం అయ్యాడు ఓ వార్డు బాయ్. అభం శుభం తెలియని… ఓ బాలుడి ప్రాణం తీశాడు.
వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. సమస్య కొంచం ఇబ్బందికరంగా మారడంతో మూడ్రోజుల క్రితం నీలోఫర్ ఆస్పత్రిలో చేర్చించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గమనించిన వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించాలని నిర్ణయించుకున్నారు. మూడ్రోజుల నుంచి బాలుడికి ఆక్సిజన్ పై చికిత్స అందిస్తున్నారు. అప్పటివరకు అంతా బానే ఉంది. బాలుడికి చికిత్స అందిస్తున్న వార్డులోనే మరో వ్యక్తికి ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. వార్డు బాయ్ వెంటనే బాలుడికి ఉన్న ఆక్సిజన్ సిలిండర్ తీసి మరో పేషంట్‌కు అమర్చాడు. ఆక్సిజన్ అందకపోవడంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడు మృతికి కారణమైన వార్డ్ బాయ్‌ని సస్పెండ్ చేశారు.
మరోవైపు ఆస్పత్రిలో బాలుడి కుటుంబసభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. ఆస్పత్రి వైద్యులు, వార్డ్ బాయ్ నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మరణించాడంటూ ఆగ్రహానికి లోనయ్యారు. ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. వార్డు బాయ్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.