ఉదయాన్నే పాఠశాలకు వెళ్తూ తల్లి కళ్లెదుటే బస్సు చక్రాల కింద నలిగి మృతి చెందిన సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. తల్లి స్కూటీ నడుపుతుంటే వెనుక సీట్లో కూర్చుని, దారి పొడవునా ఎన్నో మాటలు చెప్పిన బిడ్దను.. అనూహ్యంగా మృత్యువు కబళించడంతో ఆ కన్నతల్లి మనసు తల్లడిల్లిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న కుమారుడిని చూస్తూ.. ‘కన్నీళ్లు మిగిల్చి వెళ్లిపోయావా కన్నా..’ అంటూ గుండెలవిసేలా రోదించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
స్థానిక డీ పాల్ స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్న ఎలీజా సేవారిన్ (9) తల్లితో కలిసి నగర శివారు అగనంపూడి సమీపంలోని శనివాడలో నివసిస్తున్నాడు. తండ్రి ఎలై సేవారిన్ అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా, తల్లి సౌజన్యతో కలిసి అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. రోజూలాగానే.. మంగళవారం ఉదయం తల్లీ, కుమారులిద్దరూ స్కూటీపై స్కూల్‌కు బయల్దేరారు. సరిగ్గా డీపాల్ పాఠశాల కూడలి వద్దకు వచ్చేసరికి మలుపు తిరుగుతున్న స్కూటీని.. పరవాడలోని ఏఆర్ లైఫ్ సైన్సెస్ ఫార్మా సంస్థకు చెందిన బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో తల్లీ, కుమారులిద్దరూ చెరోవైపు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో బస్సు బాలుడి తలపై నుంచి దూసుకుపోయింది. దీంతో చిన్నారి తల భాగం నుజ్జునుజ్జయి ఘటనా స్థలిలోనే మృతిచెందాడు.
కళ్లెదుటే కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ‘కళ్లన్నీ నీ మీదే పెట్టుకుంటే, నాకు కన్నీళ్లను వదిలేసి వెళ్లిపోయావా కన్నా’ అంటూ రోదించింది. వెంటనే బస్సు డ్రైవర్, అందులోని ఉద్యోగులు పరారయ్యారు. ఈ ఘటనను చూసి ఆగ్రహానికి గురైన స్థానికులు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. స్థానికులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారు. మృతుని కుటుంబీకులకు డీపాల్ పాఠశాల యాజమాన్యం రూ. 5 లక్షలు, ట్రాన్స్‌పోర్ట్ యాజమాన్యం రూ.5 లక్షలు ఇవ్వడానికి అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరంబాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.