చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిన్నటి నుంచి కనిపించకుండా 8 ఏళ్ల బాలుడు తేజసాయిరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. అభం శుభం తెలియని చిన్నారిని ఎవరో దుర్మార్గులు పొట్టనబెట్టుకున్నారు. కె.వి పల్లి మండలం ఎగువ మేకల వారి పల్లికి చెందిన తేజసాయిరెడ్డి తల్లిదండ్రులు నాగిరెడ్డి, జ్యోతి ఉపాధి కోసం కువైట్ కి వెళ్లారు. అప్పటి నుంచి పీలేరులో ఉన్న పెద్దమ్మ ఇంట్లో ఉంటూ తేజేష్ స్కూలుకు వెళ్తున్నాడు. పండుగ సెలవులు కావడంతో.. అమ్మమ్మ పార్వతమ్మ ఇంటికి వెళ్లాడు.
పార్వతమ్మకు మనవడు తేజసాయిరెడ్డి అంటే ప్రాణం. అసలే తల్లిదండ్రులు కువైట్ లో ఉండటంతో బాలుడ్ని అల్లారుముద్దుగా చూసుకునేవారు. అమ్మమ్మ ఇంటికి వచ్చిన తేజసాయిరెడ్డి మంగళవారం కిడ్నాప్ అయ్యాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు కనిపించడకపోవడం అమ్మమ్మతో సహా బంధువులు కంగారుపడ్డారు. మంగళవారం రాత్రి వరకు ఎంత వెతికినా ప్రయోజనం కనిపించలేదు.
బంధువులంతా వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. తెల్లారి చూసేసరికి సమీపంలోని బొప్పాయి తోటలో తేజసాయిరెడ్డి శవమై కనిపించాడు. బాలుడ్ని గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుమారుడి భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కువైట్‌కు వెళ్లారు. డబ్బులు సంపాదించి బాలుడికి మంచి భవిష్యత్ ఇవ్వాలని ఎన్నో కలలు కన్నారు. కానీ.. కన్న కొడుకు కానరాని లోకానికి వెళ్లాడని వార్త తెలిసిన తర్వాత కన్నీరు మున్నీరవుతున్నారు.