పిల్లలందరూ ఒకేలా ఉంటారా? ఒకరు బాగా చదువుతారు, మరొకరు యావరేజ్ గా చదువుతారు. ముఖ్యంగా కొంతమంది చిన్న పిల్లలకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. పాఠాలు గుర్తుపెట్టుకోవడం లేదని ఒక టీచర్ బాలుడ్ని చచ్చేలా కొట్టాడు.
చిన్న పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకోవాలి. హోమ్ వర్క్ చేయలేదనో, పాఠాలు గుర్తుపెట్టుకోలేదనో వారిని చితకబాదడం అనేది తప్పు. బెత్తంతో ఇష్టమొచ్చినట్లు కొడితే పసి ప్రాణాలు ఎక్కడ తట్టుకోగలవు చెప్పండి. హోమ్ వర్క్ చేయలేదని ఓ ఉపాధ్యాయుడు ఎల్కేజీ చదువుతున్న ఏడేళ్ల విద్యార్థిని చచ్చేలా కొట్టాడు. టీచర్ కొట్టిన దెబ్బలకు తట్టుకోలేని ఆ బాబు ప్రాణాలు కోల్పోయాడు. బీహార్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. బీహార్ లోని సహర్సా ప్రాంతానికి చెందిన ఏడేళ్ల ఆదిత్య యాదవ్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. అక్కడే హాస్టల్ లో ఉంటున్నాడు.
అయితే హోమ్ వర్క్ చేయలేదని.. మాష్టారు చెప్పిన పాఠాలు వినడం లేదని సుజిత్ కుమార్ అనే ఉపాధ్యాయుడు బాలుడిని కర్రతో తీవ్రంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడు మరుసటి రోజు ఉదయం హాస్టల్ లో మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అది చూసిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయుడికి సమాచారం అందించారు. బాలుడ్ని ఆసుపతిర్కి తరలించగా.. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. స్కూల్ యాజమాన్యం బాలుడి కుటుంబానికి సమాచారం ఇచ్చింది. పాఠాలు గుర్తుపెట్టుకోవడం లేదని వరుసగా రెండు రోజులు ఆదిత్యను టీచర్ కొట్టాడని.. అందుకే ఆదిత్య శరీరంపై వాపు వచ్చిందని తోటి విద్యార్ధి వెల్లడించాడు.
ఈ విషయంపై మృతుడి తల్లి మాట్లాడుతూ.. హొలీ పండుగ తర్వాత మార్చి 14న తన కొడుకు హాస్టల్ కు వెళ్లాడని, హాస్టల్ నుంచి స్కూల్ కి వెళ్లక ముందే స్పృహ కోల్పోయాడని అన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే తన కొడుకు మరణించాడని టీచర్ సుజిత్ కుమార్ తమకు సమాచారం అందించాడని అన్నారు. తన కొడుకుని టీచర్ తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి తండ్రి టీచర్ సుజిత్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సుజిత్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరి ఏడేళ్ల బాలుడని చూడకుండా కర్రతో కొట్టి చనిపోవడానికి కారణమైన టీచర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.