నగరంలోని సైబరాబాద్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు గృహాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ రెస్క్యూ టీమ్ లు గతంలో దాడులు చేశాయి. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వేర్వేరు నేరాల్లో పట్టుబడిన యువతులు, మహిళలను కోర్టు ఆదేశాల మేరకు కస్తూర్బా గాంధీ స్మారక ట్రస్ట్‌లో చేర్చారు. వీరి పరివర్తనలో మార్పు తేవాలని, సమాజంలో గౌరవంగా బతికేలా చేయాలని వీరిని అక్కడ 20 రోజులుగా కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
పట్టుబడ్డ యువతులు, మహిళలను పూర్తి భద్రత మధ్య ట్రస్టులోని ఓ హాలులో 18 మందిని ఉంచారు. అయితే, శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో 14 మంది మహిళలు తప్పించుకొని పారిపోయారు. మొత్తంగా 15 మంది మహిళలు తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించగా.. ఓ యువతికి గాయాలు కావడంతో ఆమె అక్కడే ఉండిపోయిందని తెలుస్తోంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ 14 మంది మహిళలు పక్కా ప్లాన్ వేసి ఆశ్రమంలోని బాత్‌రూం వెంటిలేటర్ విరగ్గొట్టి, ప్రహరీ గోడను సైతం దూకి పారిపోయారు. ఉదయం వీరు లేకపోవడంతో సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఈ సంఘటన బయటపడింది. ఈ విషయాన్ని గుర్తించిన మేనేజర్ రామకృష్ణ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పారిపోయిన వారిలో ఎక్కువగా మహారాష్ట్ర, బెంగాల్‌కు చెందిన మహిళలు ఉన్నారు.
వీరి కోసం రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే, ఇనుప గ్రిల్స్‌ను ఎలా కత్తిరించారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కట్ చేసేందుకు ఏయే వస్తువులను వాడారు.. అవి వారికి ఎక్కడి నుంచి లభించాయన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గతంలోనూ హైదరాబాద్ పరిధిలోని యూసఫ్ గూడ స్టేట్ హోం నుండి 11 మంది మహిళలు పరారయ్యారు.