అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలకుంటున్నారా..? అయితే ఈ విషయాలు పరిగణలోకి తీసుకోండి. మీకు కచ్చితంగా ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది.
భారతీయులకు బంగారం అంటే ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి పండుగ, శుభకార్యాల్లోనూ పుత్తడి ధరించి సంబరాలు జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అందులోనూ అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేసే సంస్కృతి గత కొన్నేళ్లుగా పెరుగుతూనే వస్తుంది. ఇప్పుడు మళ్లీ ఆ ముహుర్తానికి వేళయింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న అనగా శనివారం నాడు అక్షయ తృతీయ రాబోతోంది. ఇప్పటికే ఆ సందడి నగరంలో మొదలైపోయింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని బంగారు నగల దుకాణాలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. ఫ్రీ గోల్డ్ కాయిన్స్, డిస్కౌట్లు అంటూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
ఒకవేళ మీరు కనుక అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని భావిస్తున్నట్లయితే ఈ కింది విషయాలు పరిగణలోకి తీసుకోండి. మీకు ఖచ్చితంగా ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది. అలా కాకుండా ఏ నగలు కనిపిస్తే ఆ నగలు కొంటే ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. అందకే కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధనలు తప్పక తెలుసుకకోండి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 1, 2023 నుంచి హాల్ మార్క్ రూల్స్ అమలులోకి వచ్చాయి. అంతే కాదు, నగల దుకాణాలు అందిస్తున్న ఆఫర్లు, వేటి వెనుక ఉన్న అసలు విషయం, మేకింగ్ ఛార్జెస్ అంటూ చాలా అంశాలు బంగారంతో ముడిపడి ఉంటాయి. కావున బంగారం కొనేందుకు సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరు అన్ని విషయాలు తెలుసుకుని నాణ్యమైన, సరమైన బంగారాన్ని ఇంటికి తీసుకెళ్లండి.
బంగారం స్వచ్చత మీకు ఇంతకుముందే తెలిసినా మళ్ళీ తెలుసుకోండి. పసిడి స్వచ్చతను క్యారెట్లలో లెక్కిస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్చమైనది కాగా, 22 క్యారెట్ల బంగారం 92 శాతం స్వచ్ఛమైనది. అయితే 24 క్యారెట్ల బంగారం ఆభరణాల తయారీకి పనికి రాదు. అందులో ఇతర లోహాలు కలుపుతారు. కాబట్టి నగల తయారీదారులు సాధారణంగా 14,18, 22 క్యారెట్ల బంగారాన్ని వాడుతుంటారు. కావున బంగారం కొనేముందు ఎన్ని క్యారెట్ల బంగారం కొంటున్నారో తెలుసుకొని ధర విషయంలో జాగ్రత్త పడండి.
బంగారం ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అంతర్జాతీయంగా పరిణామాల ఆధారంగా రోజువారీగా పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. కావున బంగారం కొనుగోలు చేస్తున్నామంటే ఆరోజు పసిడి ధర ఎంత ఉంది అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. అలాగే ఇతర నగల షాపుల్లోని ధరలను పోల్చి చూసుకోవాలి. అప్పుడే మీరు కొనే నగలకు సరైన రేటును నిర్ణయించవచ్చు.
ఈ విషయంలో కొనుగోలుదారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. బంగారు నగల డిజైన్ బట్టి మేకింగ్ ఛార్జీలు ఉంటాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరల్లో తయారీ ఖర్చులు కూడా కలిసే ఉంటున్నాయి. కాబట్టి ఈ ఖర్చుల గురించి విపులంగా తెలుసుకోవడం మంచిది. లేకపోతే నగల తయారీ సంస్థలు మీ నుంచి అధికంగా తయారీ ఖర్చులను వసూలు చేసే అవకాశం ఉంది. బంగారం ధరలను, గ్రాము చొప్పున లెక్కించి+ బరువు(గ్రాములలో)+తయారీ ఖర్చులు+జీఎస్‌టీని కలిపి లెక్కిస్తారు.
ఏప్రిల్ 1, 2023 నుంచి ప్రభుత్వం బంగారంపై హాల్‌మార్క్ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. కావున బంగారం కొనేటప్పుడు వాటిపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) హాల్‌మార్క్ ఉందో లేదో గమనిచండి. ప్రభుత్వ నిభంధన ప్రకారం 6 అంకెల హెచ్‌యూఐడీ నంబర్ ఉన్న నగలనే విక్రయించాలి. బీఐఎస్ వెబ్‌సైట్ లోకి వెళ్లి హాల్‌మార్క్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా దాని స్వచ్ఛత, తయారీదారు, విలువ అనే పూర్తి వివరాలు తెలుస్తాయి.
మన దేశంలో లక్షల సంఖ్యలో బంగారు నగల దుకాణాలున్నాయి. చిన్న చిన్న షాప్‌ల నుంచి బంగారం కొనటం అంత మంచిది కాదు. ఎందుకంటే వీటిలో నకిలీ బంగారం లేదా దొంగిలించిన బంగారం అమ్మే అవకాశాలున్నాయి. అదే పేరున్న షాప్‌లో కొనుగోలు చేస్తే గ్యారంటీ ఉంటుంది కాబట్టి రిస్క్ తక్కువ. అలాగే నాణేల రూపంలో కొనాలనుకుంటే బ్యాంకుల ద్వారా కూడా తీసుకోవచ్చు. బ్యాంకులు వివిధ విలువ కలిగిన 24 క్యారెట్ల బంగారు నాణేలను విక్రయిస్తుంటాయి.
వీటితో పాటు ఆభరణం ఎలా తయారు చేశారో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మానవులచే తయారవడంతో పోలిస్తే యంత్ర సాయంతో రూపొందించిన ఆభరణాల ఖర్చులు తక్కువగా ఉంటాయి. అలాగే ఆభరణాల తయారీలో వజ్రాలు, రాళ్లను పొందుపరచడం వల్ల బరువు పెరుగుతుంది. కావున మీరు కొనుగోలు చేసే ఆభరణంలో ఎంత బంగారాన్ని వాడారనే విషయం తెలుసుకుంటే మంచిది.