మీ దగ్గర హాల్ మార్క్ లేని పాత బంగారు నగలు ఉన్నాయా? ఐతే మీరు ఇలా చేయాలి. లేదంటే వాటికి బయట విలువ ఉండదు.
2023 ఏప్రిల్ 1 నుంచి బంగారం స్వచ్ఛత కోసం హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉండాల్సిందే అన్న నియమాన్ని తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. అలానే బంగారు ఆభరణాలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లోగో, స్వచ్ఛత గుర్తును కలిగి ఉండడం కూడా తప్పనిసరి అని తెలిపింది. దీని వల్ల బంగారం కొనుగోలు చేసేవారు మోసపోకుండా ఉంటారు. అందరికీ స్వచ్ఛమైన బంగారం లభిస్తుంది. అయితే ఇదే ఇప్పుడు పాత బంగారం ఉన్న వారికి తలనొప్పిగా మారింది. హాల్ మార్కింగ్ లేని పాత బంగారు నగలు ఉన్నవారు వాటిని అమ్ముదామన్నా లేదా కొత్త ఆభరణాల కోసం మార్చుకుందామన్న కుదరదు.
మారిన కొత్త నియమాల కారణంగా ఆభరణాలు కొనాలన్నా, అమ్మాలన్నా, పాతది ఇచ్చి కొత్తది తెచ్చుకోవాలన్నా గానీ బీఐఎస్ ప్రకారం హాల్ మార్క్, స్వచ్ఛత గుర్తు వంటివి ఉండాల్సిందే. మరి పాత బంగారు నగల మీద హాల్ మార్క్, స్వచ్ఛత గుర్తింపు వంటివి లేని వారి పరిస్థితి ఏంటి? హాల్ మార్కింగ్ లేని పాత బంగారు నగలను విక్రయించే ముందు వాటిని హాల్ మార్క్ చేయించాలి. దీనికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది బీఐఎస్ నమోదిత బంగారు నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఆ వ్యాపారి హాల్ మార్కింగ్ కోసం మీ పాత నగలను బీఐఎస్ అసేయింగ్, హాల్ మార్కింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి హాల్ మార్క్ వేయిస్తారు. ఒక్కో వస్తువుకి రూ. 45 చెల్లించాల్సి ఉంటుంది.
రెండోది వినియోగదారులే నేరుగా బీఐఎస్ నమోదిత అసేయింగ్ అండ్ హాల్ మార్కింగ్ కేంద్రానికి తీసుకెళ్లి పాత నగలకు హాల్ మార్కింగ్ చేయించుకోవచ్చు. అందుకోసం కనీస రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. ఐదు లేదా అంతకంటే ఎక్కువ నగలు ఉంటే ఒక్కో దానికి రూ. 45 చెల్లించాల్సి ఉంటుంది. మీ వద్ద హాల్ మార్కింగ్ లేని పాత నగలు ఉంటే కనుక ఈ రెండు ఆప్షన్స్ లో ఏదో ఒక దాన్ని అనుసరించి హాల్ మార్కింగ్ చేయించుకోవాలి. ఇప్పుడే చేయించుకోవడం మంచిది. ఎందుకంటే మళ్ళీ ఛార్జీలు పెరిగే అవకాశం ఉండచ్చు. హాల్ మార్కింగ్ లేకుండా మీరు మీ పాత నగలను అమ్మలేరు, వాటిని మార్చి కొత్తవి తీసుకోలేరు.