ఐఐటిల్లో చదువులు ఆ తరువాత క్యాంపస్ రిక్రూట్ మెంట్లలో భారీ ప్యాకేజీలతో కొలువులు, జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడితే చాలు ఇది నేటి యువత అనుసరిస్తున్న తీరు. మంచి వేతనంతో పేరుగాంచిన కంపెనీలో ఉద్యోగం చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలాంటి అవకాశం వస్తే ఏమాత్రం ఆలోచించకుండా ఉద్యోగంలో చేరిపోతారు. కానీ ఓ కంపెనీలో మాత్రం అత్యుత్తమ వేతనం అందుతున్నప్పటికి ఉద్యోగాలు వదిలేసి వెళుతున్నారు అక్కడ పనిచేసే మహళా ఉద్యోగులు. పురుషుల కంటే ఎక్కువగా మహిళలే ఉద్యోగాలు మానేస్తున్నారని ఆ కంపెనీ చెప్తోంది. దీనికి గల కారణం ఏంటనేది తెలుసుకుందాం.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మహిళా ఉద్యోగులు సంస్థను వీడి వెళ్లడంతో కార్పోరేట్ ఆఫీసుల్లో లింగ సమానత్వాన్ని పాటించాలన్న కంపెనీ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన విషయాలను టిసిఎస్ హ్యూమన్ రిసోర్స్ అధినేత మిలింద్ లక్కడ్ కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించారు. కంపెనీలో 6 లక్షల ఉద్యోగులు ఉండగా అందులో 35శాతం మహళలు ఉంటారు.
ఇప్పుడు వీరంతా ఆకస్మాత్తుగా కంపెనీ విడిచి వెళ్లడంతో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి టిసిఎస్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుందని తెలిపారు. కరోనా తెచ్చిన మార్పులతో మహిళలు ఇంటినుంచే వర్క్ ఫ్రం హోం చేశారని ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఆఫీసులకు రావాలని కంపెనీలు కోరుతున్నాయి. కానీ ఉద్యోగులు మాత్రం ఆఫీసుకు వచ్చి విధులు నిర్వహించేందుకు సిద్ధంగా లేరని, వర్క్ ఫ్రం హోం కు అనుమతనిచ్చే సంస్థల్లో ఉద్యోగాలు వెతుకుంటున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ కారణంతోనే మహిళా ఉద్యోగులు టిసిఎస్ నుంచి ఉద్యోగాలు మానేస్తున్నారని సంస్థ చెబుతోంది.