ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి.. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం.. అప్పుడే నీ జయం నిశ్చయంరా అని సిరివెన్నెల పాటను నిజం చేశారో మహిళ. ఓడిపోకూడదని ఆమె అడ్డుపడ్డ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి లాయర్ గా, డ్రైవర్ గా, నిపుణురాలిగా, కార్మికురాలిగా అవతారాలు ఎత్తారు. ఏ అవతారం ఎత్తినా అందులో విజయమే. ఏ వ్యాపారం చేసిన విజయమే.
మనిషిగా పుట్టిన తర్వాత తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. దాని కోసం ఎంతమంది ఎంత కష్టపడతారో తెలియదు గానీ ఈ మహిళ మాత్రం అనుకున్నది జరగడం కోసం చాలా దూరం వెళ్లారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైన ప్రతి సారీ పరిస్థితులకు తగ్గట్టు తనను తాను మార్చుకునేవారు. ఎంతలా అంటే కోర్టులో కేసు గెలవడం కోసం తానే లాయర్ గా అవతారమెత్తారు. వ్యాపారానికి సంబంధించిన రూ. 50 లక్షల యంత్రాలను కొనుగోలు చేసిన తర్వాత శిక్షణ ఇవ్వడానికి నిపుణులెవరూ లేకపోతే శిక్షణ తీసుకుని మొదటి కార్మికురాలిగా అవతారమెత్తారు. మరికొంతమందికి శిక్షణ ఇప్పించే నిపుణురాలిగా అవతారమెత్తారు. సరుకును గమ్యస్థానానికి చేర్చడం కోసం డ్రైవర్లు లేకపోతే డ్రైవర్ అవతారమెత్తారు.
ఇలా తన గమ్యం చేరేందుకు, లక్ష్యం నెరవేరడం కోసం తనను తాను మార్చుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. రూ. 50 వేల చిన్న పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టిన ఆమె.. వివిధ వ్యాపారాలు చేసి ఇప్పుడు రూ. కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. ఆమె పేరు సుధార్చన. ఊరు విజయనగరం జిల్లాలోని కొత్తపాలెం. డిగ్రీ అవ్వగానే ఇంట్లో పెళ్లి చేసేశారు. ఆమె భర్త పేరు కోటి. ఆమెకు ఇద్దరు పిల్లలు. పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. అయితే జీవితం ఏ లోటూ లేకుండా సంతోషంగా సాగిపోతున్నా గానీ తెలియని అసంతృప్తి ఆమెను వెంటాడేది. ఏదైనా చేయాలి, స్వతహాగా ఏదైనా సాధించాలి అని ఆమె అనుకున్నారు. దీంతో ఆమె తొలుత రూ. 50 వేల పెట్టుబడితో దుస్తుల వ్యాపారం మొదలుపెట్టారు. తక్కువ సమయంలోనే ఆమె సక్సెస్ అయ్యారు.
కానీ ఎక్కడో, ఎవరు తయారు చేసిన దుస్తులను అమ్మితే తన ప్రత్యేకత ఏముంటుంది అని ఆమె ఆలోచనలో పడ్డారు. కంపెనీ పెట్టి.. దాన్నుంచి తాను తయారు చేసిన వస్తువు బయట మార్కెట్ కి వెళ్తే ఆ కిక్కే వేరు అని అనుకున్నారు. అప్పుడు వచ్చిన ఆలోచనే పేపరు ప్లేట్ల తయారీ వ్యాపారం. దీని కోసం ఆమె శిక్షణ తీసుకున్నారు. సంస్థను స్థాపించడానికి రెండు ఎకరాల భూమిని కొని, దాని మీద లోన్ తీసుకుని పేపర్ ప్లేట్ల తయారీని ప్రారంభించారు. కొంతమంది మహిళలకు కూడా ఉపాధి కల్పించారు. కానీ ఏడాది మొత్తం ఇంతమందికి ఉపాధి చూపించడం కష్టమని ఆమె మరొక ఆలోచన చేశారు. ఆమె ఉండే ప్రాంతం నుంచి ప్రతి ఏటా దేశవిదేశాలకు మామిడి కాయలు, మామిడి పండ్లు ఎగుమతి అవుతుంటాయి.
వాటి ప్యాకింగ్ కి కావాల్సిన అట్టపెట్టెలను రైతులు ఢిల్లీ, విశాఖపట్నం వంటి నగరాల నుంచి కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. అవే అట్టపెట్టెలు స్థానికంగా తయారు చేస్తే రైతులకు ఛార్జీలు కలిసొస్తాయని ఆమె భావించారు. దీని కోసం రూ. 50 లక్షల విలువ చేసే అట్టపెట్టెల తయారీ యంత్రాలను ఆర్డర్ ఇచ్చారు. అయితే ఆ యంత్రాలను సదరు కంపెనీ సకాలంలో ఇవ్వకపోగా ఇవ్వమంటూ చేతులెత్తేసింది. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. ఒక లాయర్ ని కూడా పెట్టుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆమె తరపు లాయర్ కూడా చేతులెత్తేశాడు. ఈ కేసు గెలవడం కష్టమని వెనకడుగు వేశాడు. కానీ ఆమె మాత్రం కేసు గెలుస్తా అని చెప్పి తన కేసును తనే వాదించుకున్నారు. దీని కోసం ఆమె జడ్జి అనుమతి తీసుకుని లాయర్ అవతారం ఎత్తారు. సాక్ష్యాధారాలను చూపించి ఆమె కేసు గెలిచారు.
దీంతో ఆమె బుక్ చేసిన యంత్రాలను కంపెనీ ఇచ్చింది. అయితే ఆ యంత్రాలను బిగించిన తర్వాత శిక్షణ ఇచ్చే నిపుణులు దొరకలేదు. దీంతో ఆమె స్వయంగా శిక్షణ తీసుకున్నారు. ఆ విధంగా శిక్షణ తీసుకుని పని మొదలుపెట్టిన మొదటి కార్మికురాలు అయ్యారు. ఆ తర్వాత కొంతమంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. అలా అట్టపెట్టెలను తయారు చేయడం ప్రారంభించారు. తీరా తయారు చేశాక ఆ అట్టపెట్టెలను గమ్యస్థానానికి చేర్చడానికి డ్రైవర్లు దొరకలేదు. దీంతో ఆమె డ్రైవర్ అవతారం ఎత్తారు. మామిడి పండ్లు ప్యాకింగ్ చేసుకునే అట్టపెట్టెలను.. ఐషర్, బొలెరో వాహనాల్లో ఆమె గమ్యస్థానానికి చేర్చేవారు. చుట్టుపక్కల ప్రాంతాల రైతుల నుంచి భారీగా ఆర్డర్లు రావడంతో వ్యాపారం జోరుగా సాగింది. అంతా బాగుందనుకున్న సమయంలో కరోనా మహమ్మారి ఆమె పాలిట శాపంగా మారింది. కొంత నష్టం వాటిల్లింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. కానీ ఆమె తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. కలెక్టర్ అనుమతి తీసుకుని మరీ మళ్ళీ వ్యాపార పనులను ప్రారంభించారు.
ప్రస్తుతం ఆమె అట్టపెట్టెల వ్యాపారంతో రూ. కోటి సంపాదిస్తున్నారు. అప్పులన్నీ తీర్చేశారు. తాజాగా ఆమె ఎంఎస్ఎంఈ యువ పారిశ్రామికవేత్త పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. అయితే ఈ సక్సెస్ అంత ఈజీగా రాలేదు. సక్సెస్ ని నిలబెట్టుకోవడం కోసం ఆమె ఎంతో కష్టపడ్డారు. గృహిణిగా ఉన్న ఆమె ఇలా ప్రతికూల పరిస్థితులతో పోరాడడానికి లాయర్ గా, డ్రైవర్ గా, నిపుణురాలిగా, కార్మికురాలిగా, యజమానిగా, వ్యాపారవేత్తగా ఎన్నో అవతారాలు ఎత్తారు. పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. ఆమె అనుకున్న మార్గంలో మొండిగా ప్రయాణాన్ని సాగించారు. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రయాణాన్ని ఆపలేదు. మరి ఈమె సాధించిన విజయంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.