10 వేల రూపాయలతో ఏం చేయచ్చు అంటే సొంత ఊర్లోనే ఉంటూ ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆ వ్యాపారం బాగుంటే ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షల లోన్ పొందవచ్చు. ఏటా రూ. 40 లక్షల ఆదాయం తీసుకురావచ్చు. ఇదేమైనా సినిమానా.. అనుకుంటే అయిపోవడానికి అని అనుకోకండి. ఒక సాధారణ మహిళ నాలుగేళ్ళ వ్యవధిలో సాధించిన ఘనత తాలూకు కథ ఇది.
10 వేలతో ఏం చేయచ్చు అంటే ఏమైనా చేయవచ్చు, అద్భుతాలు సృష్టించవచ్చు అని ఒక మహిళ నిరూపించారు. ఆమె మహిళ కాదు, తోటి మహిళలకు ఉపాధి కల్పించిన శక్తి. అలా అని ఆమె గొప్ప గొప్ప చదువులు చదువుకోలేదండోయ్. ఆమెది ఒక గ్రామీణ ప్రాంతం. జాతర్ల, ఉత్సవాల సమయంలో రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాల మధ్య ఒక దుకాణం పెట్టి అందులో కుంకుమ అమ్మేవారు. ఆమె పేరు సుచరిత. ఊరు కరీంనగర్ జిల్లా జమ్మికుంట. ఆమె భర్త రమేష్.. ఒక ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రీషియన్. వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి, చదివించి మంచి భవిష్యత్తునివ్వాలంటే భర్త ఆదాయం సరిపోదు. అందుకే జాతర్ల సమయంలో రోడ్డు పక్కన కుంకుమ అమ్మేవారు.
ఈ ఆదాయం పెద్దగా కనబడేది కాదు. పైగా జాతర సమయంలో కొన్ని రోజులు ఇల్లొదిలి ఉండాల్సి వచ్చేది. ఇలా అయితే కష్టమని.. ఊర్లోనే ఉండి ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నారు. అయితే వ్యాపారం అంటే పెట్టుబడి ఉండాలి. పెట్టుబడి కోసం ఎందరిని అడిగినా ఎవరూ నమ్మలేదు, ఇవ్వలేదు. దీంతో భర్త నుంచి రూ. 10 వేలు తీసుకుని 2019లో మసాలా దినుసుల వ్యాపారం మొదలుపెట్టారు. ఆ వ్యాపారానికి కీర్తన అనే పేరు పెట్టారు. హైదరాబాద్, వరంగల్ నుంచి మసాలా దినుసులు హోల్ సేల్ గా కొని.. భర్త, కుమార్తెతో కలిసి చిన్న ప్యాకెట్లలో నింపేవారు. అలా నింపిన ప్యాకెట్లను స్థానికంగా ఉన్న చిన్న చిన్న దుకాణాల్లో అమ్మేవారు. మసాలా దినుసుల నాణ్యత బాగుండడంతో డిమాండ్ బాగా పెరిగింది. కానీ వ్యాపారం బాగుందనగా కరోనా దెబ్బ తగిలింది.
అయినా సరే నిరుత్సాహపడకుండా పట్టుదలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలని అనుకున్న సుచరిత పట్టుదలను చూసిన మెప్మా అధికారులు (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) కొంత ఋణం ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో సుచరిత మరో ఇద్దరు మహిళలను చేర్చుకుని వారికి మసాలా దినుసుల ప్యాకెట్ల తయారీలో శిక్షణ ఇచ్చి వ్యాపారాన్ని ఇంకొంచెం విస్తరించారు. వ్యాపారం జోరుగా సాగుతుండడంతో బ్యాంకులో రూ. లక్ష ఋణం తీసుకుని ఒక వ్యాన్ కొనుగోలు చేశారు. ఆ వ్యాన్ లో మసాలా దినుసుల ప్యాకెట్లను బల్క్ గా తీసుకెళ్లి మిగతా ఊర్లలో ఉన్న దుకాణాల్లో విక్రయించేవారు. భర్త రమేష్ తన ఉద్యోగాన్ని వదిలేసి భార్యకు అండగా నిలిచారు.
కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి, సిద్ధిపేట, జయశంకర్ భూపాలపల్లి, జనగాం ప్రాంతాల్లో ఉన్న చిరు వ్యాపారులకు వ్యాన్ లో మసాలా దినుసుల ప్యాకెట్లను అమ్మేవారు. హుజూరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుచరిత స్టాల్ ని, ఉత్పత్తులను అధికారులు పరిశీలించి ఆమెకు పీఎంఆర్వై కింద రూ. 5 లక్షల ఋణాన్ని మంజూరు చేశారు. ఈ డబ్బుతో సుచరిత ప్యాకింగ్ యంత్రాలను కొనుగోలు చేశారు. దీంతో వ్యాపారం మరింత అభివృద్ధి చెందింది. అంతేకాదు జమ్మికుంట పరిసర ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలకు ఉపాధి అవకాశం కల్పించారు. వారికి మసాలా దినుసుల ప్యాకింగ్ పై శిక్షణ ఇచ్చి.. ఇంటి వద్దనే ఉండి ఖాళీ సమయాల్లో ప్యాకింగ్ చేస్తూ డబ్బు సంపాదించుకునే అవకాశం ఇచ్చారు. తను మాత్రమే కాకుండా తోటి మహిళలకు కూడా సంపాదించుకునే అవకాశం ఇచ్చారు.
కేరళ, హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల నుంచి హోల్ సేల్ గా మసాలా దినుసులను కొనుగోలు చేసి ఇక్కడ ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. బగారా మసాలాలు, హొలీ, బతుకమ్మ పండుగలకు అవసరమైన రంగుల ప్యాకెట్లు కూడా తయారుచేసి విక్రయిస్తున్నారు. ఇలా ఆమె ఈ వ్యాపారం ద్వారా ఏడాదికి రూ. 40 లక్షలు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం చేయూతనిస్తే ఈ పరిశ్రమను మరింత విస్తరించి.. మరికొంతమంది మహిళలకు ఉపాధిని కల్పిస్తానని సుచరిత అంటున్నారు. మరి 10 వేల రూపాయలతో చిన్నగా మసాలా దినుసులు ఎక్కడ నుంచో కొనుగోలు చేసి.. వాటిని సొంత ఊర్లో అమ్ముతూ.. సొంత ఊర్లోనే ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాలకు తన వ్యాపారాన్ని విస్తరింపజేసి ఏటా 40 లక్షల టర్నోవర్ తీస్తున్న సుచరితకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇద్దరు కూతుర్ల భవిష్యత్తు కోసం తన దగ్గర గొప్ప డిగ్రీలు లేకపోయినా, తన తెలివితేటలతో ఒక చిన్న పల్లెటూరులో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించడం అంటే చిన్న విషయం కాదు. సెల్యూట్ సుచరిత.