ఐతే దిగ్గజం విప్రో కంపెనీ సంచలన నిర్ణయం తీసుకోనుంది. బోర్డు డైరెక్టర్లతో జరగనున్న సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఇంకో మూడు రోజుల్లో విప్రో కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.
ఐటీ దిగ్గజ సంస్థ విప్రో మరోసారి షేర్ల బైబ్యాక్ కు సిద్ధమవుతోంది. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను ఏప్రిల్ 27న జరిగే కంపెనీ బోర్డు సమావేశంలో పరిశీలిస్తామని.. ఆరోజే నిర్ణయాన్ని ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది. అదే రోజున కంపెనీ మార్చి నెలతో ముగిసిన నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను కూడా ప్రకటించనుంది. 2022లో 45 శాతానికి పైగా పడిపోయిన విప్రో షేర్లు.. ఈ ఏడాది 6.3 శాతం తగ్గాయి. గత ఏడాదిగా విప్రో షేర్లు వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో విప్రో కంపెనీ మళ్ళీ షేర్ల బైబ్యాక్ కు సిద్ధమవుతోంది. కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను కంపెనీ బోర్డు డైరెక్టర్లు పరిగణిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలను ఈ నెల 26-27 తేదీల్లో జరగనున్న బోర్డు మీటింగ్ లో తెలియజేయనున్నారు. ఈ మీటింగ్ తర్వాత తమ నిర్ణయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్ కి తెలియజేయనున్నారు.
ఇలా షేర్లను తిరిగి కొనడం అనేది గడిచిన ఏడేళ్లలో ఐదవ సారి. 2017లో 11 వేల కోట్లు, 2016లో 2500 కోట్లతో షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. 2019లో 1.7 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసింది. 2021లో 9500 కోట్లతో బైబ్యాక్ ను పూర్తి చేసింది విప్రో కంపెనీ. 2020 డిసెంబర్ 29 నుంచి 2021 జనవరి మధ్య కాలంలో అమలైన షేర్ల బైబ్యాక్ లో అజీమ్ ప్రేమ్ జీ కుటుంబం 22.89 కోట్ల విలువైన షేర్లను ఒక్కొక్కటి రూ. 400 చొప్పున రూ. 9,156 కోట్లకు కంపెనీకి విక్రయించింది. ఏదైనా కంపెనీ షేర్లు పడిపోయినప్పుడు ఇన్వెస్టర్లకు ధీమా కలిగించడం కోసం, కంపెనీ షేర్లు తక్కువగా ఉన్నాయని భావించినప్పుడు ఆ షేర్లను ఆ కంపెనీనే తిరిగి కొనుగోలు చేస్తుంటుంది.
క్యాపిటల్ మార్కెట్ నుంచి తన షేర్లను కంపెనీ తిరిగి కొనుగోలు చేసేందుకు బైబ్యాక్ అనేది వీలు కల్పిస్తుంది. కంపెనీ షేర్ హోల్డర్స్ కి నగదును ఉపయోగించి రివార్డ్ ఇవ్వడం ద్వారా లేదా తక్కువగా ఉన్న స్టాక్ ధరను పెంచడం వంటి కారణాల వల్ల బైబ్యాక్ చేసే వీలు ఉంటుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో షేర్లను బైబ్యాక్ ను విప్రో కంపెనీ పరిగణించలేదు. ఎందుకంటే విప్రో కంపెనీ తన నగదును దూకుడుగా విలీనం చేయడానికి, కొనుగోళ్ల కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. విప్రో కంపెనీ బైబ్యాక్ సైజ్ అనేది గత రెండు సందర్భాలుగా క్షీణిస్తూ వచ్చింది. గతంలో మూడు సందర్భాల్లో చేసినట్లే టెండర్ ఆఫర్ ద్వారా విప్రో బైబ్యాక్ ను ప్రకటించే అవకాశం ఉంది. లేదా ఇన్ఫోసిస్, పేటీఎం వంటి కంపెనీల బాటలో ఓపెన్ మార్కెట్ నుంచి షేర్లను కొనే అవకాశం ఉండవచ్చు.
టెండర్ ఆఫర్ కింద కంపెనీ.. షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు షేర్ హోల్డర్లకు ఒక నిర్దిష్ట ధరను ఆఫర్ చేస్తోంది. షేర్ హోల్డర్లు టెండర్ చేయవచ్చు అంటే షేర్లు అమ్ముకోవచ్చు. టెండర్ ఆఫర్ బైబ్యాక్ అనేది పెట్టుబడులు పెట్టిన వారికి షేర్ల మీద అధిక ధరను పొందే ప్రయోజనం పొందుతూ.. షేర్ హోల్డర్ పొజిషన్ నుంచి నిష్క్రమించే అవకాశం కల్పిస్తుంది. ఓపెన్ మార్కెట్ కింద కంపెనీ తన షేర్లను ఎక్స్ఛేంజ్ లో విక్రేతల నుంచి చురుగ్గా కొనుగోలు చేయవచ్చు. టెండర్ ఆఫర్ ద్వారా వెళ్తుందా? లేక ఓపెన్ మార్కెట్ ద్వారా బైబ్యాక్ చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఏదైనా గానీ ఏప్రిల్ 27న దీనికి సంబంధించి తుది నిర్ణయాన్ని కంపెనీ వెల్లడించనుంది.
WIPRO TO CONSIDER BUYBACK ON 27 APRIL 2023 pic.twitter.com/J3m2D4d8Nr
— Yatin Mota (@YatinMota) April 23, 2023