రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ కారణంగా రియల్ ఎస్టేట్ పై ప్రభావం పడనుందా? భూముల ధరలు తగ్గుతాయా? ఎవరికి నష్టం చేకూరనుంది? ఎవరికి లాభం చేకూరనుంది?
రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పెద్ద నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకూ అవకాశం ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల సంపన్నులపై, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మీరు భూమిని లేదా స్థలాన్ని కొనడానికి వెళ్తారు. విక్రయించే పెద్ద మనిషి ప్రభుత్వ రేటు కంటే అత్యధికంగా ఉన్న మార్కెట్ ధరను చెబుతాడు. ఉదాహరణకు ప్రభుత్వ ధర ప్రకారం ఒక చదరపు అడుగు రూ. 2 వేలు అనుకుంటే.. మార్కెట్ ధర ప్రకారం మీ నుంచి రూ. 10 వేలు వసూలు చేస్తాడు. కానీ రిజిస్ట్రేషన్ సమయంలో చదరపు అడుగు రూ. 2 వేలకే అమ్మినట్టు చెబుతాడు.
దీని వల్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలనేవి తగ్గుతాయి. అప్పుడు అమ్ముకునేవాడికి బాగా లాభం ఉంటుంది. అయితే కొనేవాడు ఇవేమీ పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే తన దగ్గరున్న పెద్ద నోట్లను ఎలా అయినా ఆస్తి రూపంలో మార్చుకోవాలని అనుకుంటాడు. అందుకే నల్ల ధనాన్ని ఉపయోగించి మార్కెట్ ప్రకారం స్థలాలు కొనుగోలు చేస్తాడు. ఇదీ జరుగుతున్న ప్రక్రియ. దాదాపు 80 శాతం చెల్లింపులనేవి ఈ నల్లధనం రూపంలోనే జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నల్లధనం రూపంలో పేరుకుపోయిన ఈ రెండు వేల నోట్లను మార్చుకోవడం కోసం ఫ్లాట్ లు, ప్లాట్ లు వంటివి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు 2 వేల రూపాయల నోట్ల ఉపసంహరణ కారణంగా.. భూములను కొనలేరు.
ఒకవేళ బ్యాంకుల్లో నోట్లను మార్చుకుందామన్న అంత డబ్బు ఎలా వచ్చిందో అనేది లెక్క చెప్పాల్సి ఉంటుంది. అక్రమంగా సంపాదించిన డబ్బు కాబట్టి బ్యాంకులకు వెళ్లే సాహసం చేయలేరు. అలా అని స్థలాలు కొనలేరు. ఈ కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కొనేవారు ముందుకు రాకపోవడంతో తక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరోవైపు కొన్నాళ్ల పాటు రియల్ ఎస్టేట్ అనేది స్థిరంగా ఉండే అవకాశం ఉంటుందని, భూముల ధరలు పెరిగే అవకాశం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండిటిలో ఏది జరిగినా గానీ రియల్ ఎస్టేట్ పై ప్రభావం ఉంటుంది. కాబట్టి భూముల ధరలు విచ్చలవిడిగా అయితే పెరగవు అనేది విశ్లేషకుల మాట.