నిన్న మొన్నటి దాకా ఆకాశాన్నింటిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇది కొనుగోలుదారులకు శుభపరిణామంగా ఉన్నా రాబోవు రోజుల్లో వీటి ధరలు ఎలా ఉండబోతాయన్నది అంతుపట్టడం లేదు. అందులోనూ.. బడ్జెట్ అప్పుడు పెరుగుతుందన్న బంగారం ధర రోజులు గడిచేకొద్దీ తగ్గుముఖం పడుతోంది. ఇది దేనికి సంకేతమో వివరణ ఇచ్చేదే ఈ కథనం..
బంగారం కొనాలకుంటున్నవారికి, అమితంగా ఇష్టపడే మగువలకు శుభవార్త. పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న మొన్నటిదాకా ఆకాశాన్నింటిన బంగారం ధర ఒక్కసారిగా నేలచూపులు చూస్తోంది. అంతేకాదు.. దీని జోరు చూస్తుంటే రానున్న రోజుల్లో ధర మరింత తగ్గే సూచనలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి విశ్లేషకులు భావించినట్లు రాబోవు రోజుల్లో పసిడి ధర తగ్గుతుందా..? ఇలా బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు పడిపోతున్నాయి. బడ్జెట్ అప్పుడు పెరుగుతుందన్న బంగారం ధర ఎందుకు క్షీణిస్తోంది? అందుకు గల కారణాలేంటి..? అన్నది ప్రతి ఒక్కరిని వేధిస్తోన్న ప్రశ్న. అందుకు సమాధానం చూపేదే ఈ కథనం..
కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ 2023-24ను ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టగా పెరిగిన కస్టమ్స్ డ్యూటీ ధరలు ఫిబ్రవరి 2నుంచి అమలులోకి వచ్చాయి. అంటే.. తరువాత రోజు నుంచే ధరలలో వ్యత్యాసం ఉండాలి. కానీ, జ్యువెలరీ మార్కెట్ లో అందుకు భిన్నంగా జరుగుతోంది. ఫిబ్రవరి 3న పసిడి ధరలు స్వల్పంగా పెరిగినా.. ఫిబ్రవరి 4 నుంచి తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. గత పది రోజులలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలను నిశితంగా గమనిస్తే.. ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
ఫిబ్రవరి 5, 8, 12న తప్ప మిగిలిన రోజుల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించడం గమనార్హం. ఫిబ్రవరి 6న అత్యధికంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 250 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 280 రూపాయలు పెరగడాన్ని గమనించవచ్చు. అదే తగ్గడం విషయానికొస్తే.. ఫిబ్రవరి 4న, 10న బంగారం ధర భారీ స్థాయిలో తగ్గింది. ఫిబ్రవరి 4న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 700 రూపాయలు తగ్గగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 770 రూపాయలు తగ్గింది. అలాగే.. ఫిబ్రవరి 10న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 500 రూపాయలు తగ్గగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 550 రూపాయలు తగ్గింది. ఇక ఇవాళ చూసుకుంటే.. 100 రూపాయలు తగ్గి 22 క్యారెట్ల బంగారం రూ.52,500గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,230గా ఉంది.
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. నిత్యం ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే అనేక పరిణామాల మీద ఆధారపడి ఈ ధరలలో వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు హెచ్చుతగ్గులపై మన దేశంలో ధరలు మారుతుంటాయి. అగ్రదేశాల మధ్య ఆరోపణలు, యుద్ధం ప్రభావం, పెద్ద దేశాల సెంట్రల్ బ్యాంకులు తీసుకునే నిర్ణయాలు వంటివి పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి.
అలాగే.. మనదేశంలో సెంట్రల్ బ్యాంక్ తీసుకునే నిర్ణయాలు, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, ద్రవ్యోల్బణం, జ్యువెలరీ మార్కెట్ లో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి. అయితే.. ప్రస్తుతానికి బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ మున్ముందు మరింత పెరగవచ్చని బులియన్ మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో తులం బంగారం రూ.60,000 దాటే అవకాశాలున్నాయని వారు అంచనా వేస్తున్నారు. రాబోవు రోజుల్లో బంగారం ధర పెరుగుతుందా..? తగ్గుతుందా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.