ఆస్తులు అమ్మ పేరు మీద కొనాలా? లేక భార్య పేరు మీద కొనాలా? ఎవరి పేరు మీద కొంటే మంచిది? ఎవరి పేరు మీద కొంటే కరెక్ట్? అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఈ కథనం ఉపయోగపడుతుంది.
అమ్మ, ఆలి ఈ ఇద్దరిలో ఎవరు ముఖ్యం అంటే ఎటూ తేల్చుకోలేని కొడుకులు, భర్తలు ఉన్న సమాజంలో బతుకుతున్నాం మనం. అ ఆ అక్షరాల్లా పక్కపక్కనే ఉంటారు కానీ ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే కలిసి ఉండడం అనేది జరుగుతుంది. జనరల్ గా అందరూ చెప్పేది ఏంటంటే అమ్మ, ఆలి ఇద్దరూ ముఖ్యమే అని. అమ్మ, ఆలి రెండూ రెండు కళ్ళు లాంటివారని చెప్పాలి. ఎందుకంటే అమ్మ జన్మనిచ్చి పాతికేళ్ళు పెంచితే.. ఆలి బతికినంత కాలం అమ్మలా ప్రేమని పంచుతూ ఉంటుంది. అమ్మ సేవ, ఆలి సేవ.. పదాలు మాత్రమే తేడా, వయసు మాత్రమే తేడా. ఇద్దరిదీ ఒకటే ప్రేమ. మరి ఏదైనా ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఎవరి పేరు మీద పెట్టాలి? కొడుకుగా అమ్మ పేరు మీద పెట్టాలా? లేదంటే భర్తగా భార్య పేరు మీద పెట్టాలా? ఎవరి పేరు మీద పెట్టాలి? ఎవరి పేరు మీద పెట్టడం కరెక్ట్?
అమ్మ లేదా ఆలి.. ఇద్దరూ ఆడవాళ్లే కదా. మగవాళ్ల పేరు మీద ఎందుకు పెట్టకూడదు అన్న సందేహం వచ్చే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆస్తులు ఆడవారి పేరు మీద పెట్టడం అంటే వారికంటూ ఒక రక్షణను కల్పించినట్టు. మగవారి పేరు మీద ఉంటే ఏమైనా జరగొచ్చు. అప్పులు ఇవ్వడం, జల్సాలు చేయడం వంటి పనుల వల్ల ఆస్తులు కోల్పోయే అవకాశం ఉంటుంది. అదే ఆడవారి పేరు మీద పెడితే గ్రామదేవతలా ఆస్తికి కాపలాగా ఉంటారు. మన దేశంలో మెజారిటీ ఆడవారి చేతుల్లో ఆస్తులు ఎప్పుడూ భద్రంగానే ఉంటాయి. అందుకే చాలా మంది మగవారు ఇంట్లో ఆడవారి పేరు మీద ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయిస్తారు. పైగా ఆడవారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల పన్ను ప్రయోజనాలు, ఇతర ప్రయోజనాలు ఉంటాయి.
మగవారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పడే ట్యాక్స్ కన్నా ఆడవారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పడే పన్నే తక్కువ. అందుకే ఆడవారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తారు చాలా మంది. బ్యాంకు రుణాలు వంటివి సులువుగా వస్తాయి. కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అయితే ఒక కొడుకుగా తల్లి పేరు మీద ఆస్తి కొనాలా? లేక భర్తగా భార్య పేరు మీద కొనాలా? అంటే భార్య పేరు మీద కొంటేనే మంచిది. అమ్మకి మీరొక్కరే సంతానం అయితే కనుక ఆమె పేరు మీద ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించినా పర్లేదు. అయితే మీరు కాకుండా ఇతర సంతానం ఉంటే మాత్రం భవిష్యత్తులో సమస్య అవుతుంది. ఎందుకంటే అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా. కుటుంబంలో కలహాలు రావచ్చు.
ఉదాహరణకు ఒక ఏరియాలో కోటి రూపాయలు పెట్టి స్థలం కొన్నారనుకోండి. మీకు దాన్ని మీ తల్లి గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఎప్పుడైనా వ్యాపారంలో నష్టమొచ్చో లేదా ఉద్యోగం కోల్పోయో లేదా అప్పులు తీర్చడానికో లేదా ఏదైనా పెట్టుబడి కోసమో స్థలం అమ్మాలనుకున్నప్పుడు మీకు కుటుంబ సభ్యులు అడ్డుపడతారు. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి ఆస్తి అనేది వారసత్వంగా వస్తుంది. వారసులు ఎంతమంది ఉంటే అంతమందికి ఆస్తి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అందరూ మంచివారే అయినా వారి భాగస్వాములు ఎలా ఉంటారో అనేది చెప్పలేము. ఒకవేళ అదృష్టం బాగుండి కోటి రూపాయల స్థలం పది కోట్లు అయితే ఆశ పుట్టకుండా ఉంటుందా? వాటా అడగకుండా ఉంటారా? ఇలా చాలా సమస్యలు ఎదురవుతాయి.
ఇవేమీ కాకపోయినా తోబుట్టువులతో గొడవలు ఉన్నా గానీ స్థలం అమ్మేటప్పుడు సంతకం పెట్టడానికి ముందుకు రారు. దీని వల్ల బయ్యర్ స్థలాన్ని కొనరు. అదేంటండి మరి అమ్మ పేరు మీద ఆస్తి లేకపోతే రేపు నాకు ఏమైనా అయితే ఆమెను ఎవరు చూసుకుంటారు అని మీకు అనిపిస్తుంది. నా భార్య చూస్తుందో లేదో.. చూసే పరిస్థితి ఉంటుందో లేదో అన్న భయం ఉంటుంది. అటువంటి సందర్భంలో అమ్మ పేరు మీద చిన్న ప్రాపర్టీ కొనుగోలు చేయడం మంచిది. ఇక ఏ ఆస్తులు కొన్నా భార్య పేరు మీద కొనడం మంచిది. ఎందుకంటే పొరపాటున ఏం జరిగినా పిల్లలకు భరోసా ఉంటుంది. ఒకవేళ అన్ని ఆస్తులు కొనే పరిస్థితి లేకపోయినా గానీ అమ్మ పేరు మీద పెట్టాలా? భార్య పేరు మీద పెట్టాలా? అన్న ఆలోచన వచ్చిందంటే మీరు ఇద్దరినీ బాగా చూసుకుంటారని అర్థం.
అటువంటప్పుడు అమ్మ పేరు మీద ఆస్తి పెట్టినా, పెట్టకున్నా ఒకటే. ఎందుకంటే మీకు ఆ ఆలోచన ఉందంటే అమ్మని బాగా చూసుకుంటారనే కదా అర్థం. అయినా అమ్మకి మహా వృక్షాల్లా నిలబడిపోయిన పిల్లలు ఎదురుగా ఉంటే ఆస్తులతో పనేముంటుంది చెప్పండి. పిల్లలే వారి ఆస్తి కదా. ఇంకో కోణంలో కూడా ఆలోచిస్తే.. భార్య పేరు మీద ఆస్తి రాసిన తర్వాత విడాకులు ఇచ్చే పరిస్థితి వస్తే ఆమె పేరు మీద పెట్టిన ఆస్తి మళ్ళీ వస్తుందా? అన్న ఆలోచన కూడా రావాలి. అప్పుడు మగవారు కూడా సేఫ్ సైడ్ సగం ఆస్తిని తమ పేరు మీద పెట్టుకోవాలి. లేదా జాయింట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. చాలా వరకూ మెజారిటీ వివాహ బంధాలు అనేవి తెగిపోవు కాబట్టి ఇలాంటి ఆలోచనలకు తావే ఉండదు. భార్య పేరు మీద ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేస్తే బ్యాంకు లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుంది, స్టాంప్ డ్యూటీ ఛార్జీల మినహాయింపు ఉంటుంది. పన్ను రాయితీలకు పన్ను మినహాయింపులు ఉంటాయి. ఇలా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఫైనల్ గా ఆస్తి అమ్మ పేరు మీద పెట్టాలా? లేదా భార్య పేరు మీద పెట్టాలా అంటే భార్య పేరు మీద పెట్టుకోవడం మంచిదనే ఎక్కువ మంది చెబుతారు.